ప్రచండ గాలులు : కూకటివేళ్లతో సహా కూలిన వేల చెట్లు, కరెంట్ స్తంభాలు, సెల్ టవర్లు

ఒడిషాను ఫోని తుఫాన్ వణికించింది. ఆరు జిల్లాలపై ప్రభావం చూపింది. 200 కిలోమీటర్ల ప్రచండ వేగంతో గాలులు తీర ప్రాంతాలను అల్లకల్లోలం చేశాయి. గాలుల ధాటికి వేలాది చెట్లు కూలిపోయాయి. రోడ్ల పక్కన ఉన్న చెట్లు కూకటి వేళ్లతో సహా వేచి వచ్చాయి. గోపాల్ పూర్ ప్రాంతంలోని వేలాది కొబ్బరిచెట్లు వేళ్లతో సహా పెకిలించబడ్డాయి. విరిగిన చెట్లు రోడ్లకు అడ్డంగా పడడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. పూరీ, భువనేశ్వర్ తీర ప్రాంతాల్లో కొబ్బరి చెట్లు విరిగిపడడంతో భారీ నష్టమే కలిగింది. తుఫానుతో ఐదుగురు మృతి చెందారు. భారీగా ఆస్తినష్టం సంభవించింది. ఈదురుగాలులకు చెట్లు, స్తంభాలు కూలాయి. చెట్లు కూలిన ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి. కోతకు గురయ్యాయి.
2019, మే 03వ తేదీ శుక్రవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో తుఫాన్ కన్ను పూర్తిగా పూరీకి సమీపంలో తీరం దాటింది. ఊహించిన దానికంటే గాలుల తీవ్రత ఎక్కువగా ఉంది. 175-185 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అంచనా వేసినా.. తీరం దాటి సమయంలో వేగం పెరిగింది. 225-240 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినట్లు నమోదు అయ్యింది. రోడ్లపై ఎక్కడికక్కడ చెట్లు అడ్డంగా పడి ఉన్నాయి. ఇక కొబ్బరితోటలు నామరూపాల్లేకుండా పోయాయి. నిన్నటి వరకు ఇక్కడ కొబ్బరితోట ఉండేది అని తుఫాన్ తర్వాత చెప్పుకునే పరిస్థితి కనిపిస్తోంది గోపాల్ పూర్ ప్రాంతంలో. ఒక్క చెట్లే కాదు.. కరెంటు స్తంభాలు ఎగిరిపడ్డాయి. సెల్ టవర్లు ఎన్ని కూలిపోయాయో ఇంకా అంచనా వేయలేకపోతున్నారు. పూరీ, గోపాల్ పూర్, చిలిక, బాంద్ బలీ ప్రాంతాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థ మొత్తం దెబ్బతిన్నది. ఎన్డీఆర్ఎఫ్, ఇతర బృందాలు రంగంలోకి దిగాయి. కూలిపోయిన చెట్లను తొలగిస్తున్నారు.
తుఫాన్ తీరం దాటిన తర్వాత అతి భారీ వర్షాలు పడుతున్నాయి. మరో 48 గంటలు వర్షాలతో అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ వార్నింగ్ ఇచ్చింది. ప్రస్తుతం పశ్చిమబెంగాల్ వైపు వెళుతున్న తుఫాన్.. ఈ రాత్రికి కోల్ కతాను తాకనుంది. అయితే ఈ మధ్యలోనే బాలాసోర్ దగ్గర తుఫాను మళ్లీ సముద్రంలోకి వెళ్లే అవకాశం ఉందని చెబుతున్నారు అధికారులు.