ప్రీ పోల్ సర్వే…ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ క్లీన్ స్వీప్..కమలం కకావికలం

దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఢిల్లీ సీఎం పీఠాన్ని దక్కించుకోవాలని వ్యూహాలు రచిస్తున్న బీజేపీకి ఢిల్లీ ఓటర్లు గట్టి షాక్ ఇచ్చేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి-8,2020న జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకే ప్రజలు మరోసారి పట్టం కట్టనున్నారని IANS-C VOTER ప్రీ పోల్ సర్వేలో తేలింది. కేజ్రీవాల్ క్రేజ్ ముందు కమలం వాడిపోతుందని ఈ సర్వే ద్వారా తెలుస్తోంది. క్లీన్ స్వీప్ చేసి ఢిల్లీ సీఎం పీఠంపై కేజ్రీవాల్ మరోసారి కూర్చోబోతున్నారని తెలిపింది. 

ఇప్పటికిప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరిగితే మొత్తం 70 స్థానాల్లో ఆప్ కు 59 సీట్లు వస్తాయని సర్వే తెలిపింది. పోల్ అయిన ఓట్లలో సింహభాగం షేర్ తో 2015లో చూపించిన సత్తానే అరవింద్ కేజ్రీవాల్ రిపీట్ చేయబోతున్నారని ఈ సర్వే చెబుతోంది. ఆప్ కు 53.3శాతం,బీజేపీకి 25.9శాతం ఓటింగ్ వచ్చే అవకాశముందని తెలిపింది. 25.9శాతం ఓటింగ్ తో బీజేపీకి కేవలం 8సీట్లు గెల్చుకునే సత్తా ఉందని,ఇక సుదీర్ఘకాలం ఢిల్లీని పాలించిన కాంగ్రెస్ అయితే కేవలం 3సీట్లు మాత్రమే గెల్చుకునే అవకాశముందని తెలిపింది. జనవరి మొదటివారంలో నిర్వహించిన ఈ ప్రీ పోల్ సర్వే వివరాలు మంగళవారం రిలీజ్ అయ్యాయి. ఈ సర్వే శాంపిల్ సైజ్ 13వేల76.

2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ 67సీట్లతో క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే. ఈసారి కూడా 2015 రిపీట్ చేసేందుకు కేజ్రీవాల్ కొత్త వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో ఆప్ ఒప్పందం కుదుర్చుకుంది. మరోవైపు బీజేపీ కూడా ఢిల్లీ ఎన్నికలపై ఫుల్ సీరియస్ గా వర్క్ చేస్తుంది. ఇక కాంగ్రెస్ అయితే ఈ రేస్ లో వెనుకబడినట్లే చెప్పవచ్చు. ఏళ్ల పాటు ఢిల్లీని పాలించిన కాంగ్రెస్ కు నాయకత్వ లేమి గట్టిగా కన్పిస్తోంది.