Delhi New CM Atishi
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి క్రౌడ్ ఫండింగ్ కోసం ముఖ్యమంత్రి అతిశీ ఇవాళ ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రజలు తమ పార్టీ చేసిన అభివృద్ధి పనులకు మద్దతు ఇస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు.
అతిశీ ఇవాళ ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎన్నికల్లో పోరాడేందుకు తనకు రూ.40 లక్షలు అవసరమని అన్నారు. డబ్బును విరాళంగా అందించడానికి ఆన్‌లైన్ లింక్‌ను కూడా అతిశీ విడుదల చేశారు. తమ పార్టీ పదేళ్లుగా ఢిల్లీలో అధికారంలో ఉన్నప్పటికీ రూపాయి కూడా అవినీతి లేదని చెప్పుకొచ్చారు.
గత ఎన్నికల్లో మాదిరిగానే ప్రజల మద్దతుతో ఈ ఎన్నికల్లోనూ పోటీ చేస్తామని ఆమె అన్నారు. బీజేపీ నేతలు వారి స్నేహితుల నుంచి, ప్రభుత్వ కాంట్రాక్టుల ద్వారా కావాల్సినంత డబ్బును వసూలు చేసి ఉండవచ్చని, దీంతో ఆ పార్టీ నేతలు ఎన్నికల్లో పోటీ చేయడానికి నిధులు సేకరించాల్సిన అవసరం లేదని ఎద్దేవా చేశారు.
కాగా, ఆప్ సీనియర్ నాయకుడు మనీశ్ సిసోడియా కూడా ఇప్పటికే క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫాంను ప్రారంభించారు. తన ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి ఆర్థిక సాయాన్ని కోరారు. ఇప్పటికే ఢిల్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 5న ఎన్నికలు జరగనున్నాయి. అదే నెల 8న ఫలితాలు వెలువడనున్నాయి.
హైదరాబాద్‌లో వారికి కూడా రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు : మంత్రి పొన్నం ప్రభాకర్