చీపురు ఊడ్చేసింది : ఎగ్జిట్ పోల్స్..ఢిల్లీ పీఠంపై AAP

  • Publish Date - February 8, 2020 / 01:36 PM IST

అందరూ ఎదురు చూస్తున్న ఢిల్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిపోయింది. 70 నియోజకవర్గాలకు ఫిబ్రవరి 08వ తేదీ శుక్రవారం ఎన్నికల పోలింగ్ నిర్వహించారు అధికారులు. మరోసారి అధికారంలోకి ఆప్ వస్తుందా ? బీజేపీ ప్రభావితం చూపిస్తుందా ? అనే ఉత్కంఠ నెలకొంది. సాయంత్రం 5 గంటల వరకు 57.9 శాతం పోలింగ్ నమోదైంది. దీంతో ఓటరు ఎవరికి పట్టం కట్టారనే దానిపై హాట్ హాట్ చర్చలు జరిగాయి.

సాయంత్రం 6 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. అన్ని సంస్థలు AAPకి పట్టం కట్టాయి. సుమారు 50 స్థానాల్లో విజయం సాధిస్తుందని అంచనా వేశాయి. బీజేపీ కేవలం 20 నుంచి 30 స్థానాల్లో గెలుపొందే అవకాశం ఉందని వెల్లడించాయి. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే..అసలు ఏ మాత్రం ప్రభావితం చూపలేదని తెలిపింది. కేవలం రెండు స్థానాల్లో మాత్రమే గెలిచే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నాయి. 

ఆప్‌కే ఎందుకు ? 
మరోసారి ఢిల్లీ పీఠం ఆప్ వశమయ్యే అవకాశాలున్నాయని ఎగ్జిట్ పోల్స్ చెబుతుండడంతో ఆ పార్టీ నేతలు సంబరాలు జరుపుకుంటున్నారు. ఆప్‌కే మరోసారి ఓటర్లు ఎందుకు పట్టం కట్టారనే దానిపై విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కేజ్రీవాల్ అనుసరించిన విధానం ప్రజలను ఆకట్టుకుందంటున్నారు. ప్రధానంగా విద్యుత్, హెల్త్, పబ్లిక్ ట్రాన్స్ పోర్టు, విద్య, పబ్లిక్ సేఫ్టీ ఇతర అంశాలపై పారదర్శకంగా వ్యవహరించారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ప్రజలు గవర్ననెన్స్, అభివృద్ధికి ఓటు వేశారని తెలిపారు. కాంగ్రెస్ ఓటు ఇక్కడ పతనమైందని, ఈ పార్టీకి పడాల్సిన ఓట్లు..గంపగుత్తగా ఆప్‌కు పడ్డాయని అంచనా వేస్తున్నారు. 
 

బీజేపీ లోటు : 
బీజేపీకి స్థానిక నాయకులు లేకపోవడం పెద్దదెబ్బ అని వివరిస్తున్నారు. గతంలో కిరణ్ బేడీని పెట్టి ఘోరంగా విఫలం చెందిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇద్దరు వ్యక్తుల మధ్య ఎన్నికలు జరిగినట్లుగా బీజేపీ మార్చేసిందని, సో..ఇక్కడ కేజ్రీ..మోడీ మధ్య పోరు జరిగిందన్నారు. రాష్ట్రాలకు రాగానే..బీజేపీ వ్యతిరేకంగా ఓట్లు పడుతున్నాయనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలంటున్నారు. బీజేపీకి అనుకూలంగా ఉన్న ఓటర్లు..ఆసక్తిగా ఓటింగ్‌లో పాల్గొనలేదన్నారు. ఇక్కడ ఓటింగ్ శాతం తక్కువ కావడమే నిదర్శనమంటున్నారు. మరి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులవుతాయా ? నిజమౌతాయా అంటే ఫిబ్రవరి 11న ఈవీఎంలు తెరిస్తే..తెలుస్తుంది.