Ritika
Ritika : నీట్ లో ర్యాంకు సాధించి డాక్టర్ కావాలని విద్యార్థులు కలలు కంటారు. ఇందుకోసం మంచి కోచింగ్ సెంటర్ లో జాయిన్ అవుతారు. వేలకు వేలు ఫీజులు చెల్లిస్తారు. మంచి స్టడీ మెటీరియల్ కొంటారు. ఇలా కోచింగ్ సెంటర్ లో జాయిన్ అయ్యి స్టడీ మెటీరియల్ కొని చదివితేనే నీట్ లో ర్యాంకు వస్తుందా? మరి ఆర్థిక స్తోమత లేని పేద విద్యార్థుల సంగతి ఏంటి? వారు ఎలా చదువుకోవాలి? పేద విద్యార్థులు డాక్టర్ కాలేరా? ఈ ప్రశ్నలకు సమాధానమే రితిక.
ఢిల్లీలోని మోలార్‌బండ్‌లోని సర్వోద్య కన్యా విద్యాలయానికి చెందిన రితిక ఎలాంటి కోచింగ్ లేకుండానే 2021 నీట్‌లో మంచి ర్యాంకు సాధించింది. ప్రైవేట్ కోచింగ్ కేంద్రాల్లో చేరకుండానే ఈ ఘనత సాధించింది. కరోనా సమయంలోనూ ఆమె ఎలాంటి ఆన్‌లైన్ తరగతులకు కూడా హాజరుకాలేదు. ఇక ప్రత్యేక స్టడీ మెటీరియల్ ఏమీ లేకుండానే నీట్‌లో ఉత్తీర్ణత సాధించింది. మరో విశేషం ఏంటంటే.. రితిక సర్కారు బడిలో చదువుకుంది.
YouTube: యూట్యూబ్‌లో ఫ్యాన్ వార్‌కి చెక్.. ఇక ఆ కౌంట్ కనిపించదు
అవును.. కేవలం యూట్యూబ్ వీడియోలు చూసి, పుస్తకాలు చదివి రితిక నీట్ లో ర్యాంకు సాధించింది. తన పెళ్లి కోసం పొదుపు చేసిన డబ్బుతో పుస్తకాలు, స్మార్ట్ ఫోన్ కొని అందులో యూట్యూబ్ వీడియోలు చూసి ఉత్తీర్ణత సాధించింది.
తల్లిదండ్రులు, ఇద్దరు తమ్ముళ్లతో రితిక ఢిల్లీలోని బదర్‌పూర్‌లో రెండు గదుల ఇరుకు ఇంట్లో నివాసం ఉంటోంది. ఆమె కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. మొదట్లో రితికకు కనీసం మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కూడా లేదు. తండ్రి ఓ ప్రైవేట్ ఎంబ్రాయిడరీ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. కరోనా సమయంలో ఆ ఉద్యోగం కూడా పోయింది. దీంతో ఆ కుటుంబం ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. తినడానికి కూడా ఆ కుటుంబం ఇబ్బందులు పడింది.
కాగా, ఇంటర్ లో 93 శాతం మార్కులు రావడంతో, తల్లి దగ్గరున్న కొద్దిపాటి ఆభరణాలు, సోదరుడు తన పెళ్లి కోసం పొదుపు చేసిన మొత్తంతో తనకు స్మార్ట్ ఫోన్ కొనిచ్చారని రితిక చెప్పింది. ఆ ఫోన్ లోనే యూట్యూబ్ వీడియోలు చూసి నీట్ కు ప్రిపేర్ అయ్యింది. నీట్ 2021లో రితిక 500 మార్కులు సాధించి షెడ్యూల్డ్ కులాల (SC) విభాగంలో 3032 ర్యాంకు సాధించింది.
‘‘ ఆర్థిక ఇబ్బందులతో ప్రైవేటు కోచింగ్ తీసుకోలేకపోయాను. ఫోన్ లో యూట్యూబ్ వీడియోలు చూసి, పుస్తకాల చదివి పరీక్షలకు ప్రిపేర్ అయ్యాను. మా ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు చాలా సాయం చేశారు. ఎప్పటికప్పుడు నన్ను ప్రోత్సహించారు. పాఠశాల లైబ్రరీలో పుస్తకాలు చదువుకునేందుకు అనుమతించారు’’ అని రితిక చెప్పింది. రితిక ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంది.
Snake : పాము కాటుకు గురైన వెంటనే ఏం చేయాలో తెలుసా?
ఈ రోజుల్లో డబ్బుంటేనే చదువులు అనే అభిప్రాయం ఉంది. ఎంత డబ్బు ఖర్చు చేస్తే అంత బాగా చదువు వస్తుందని నమ్ముతారు. కార్పొరేట్ స్కూల్ లో, ప్రైవేట్ కోచింగ్ సెంటర్లలో విద్యను అభ్యసిస్తేనే పిల్లల కెరీర్ బాగుంటుందని, ర్యాంకులు వస్తాయని, ఉద్యోగాలు దొరుకుతాయని అనుకుంటారు. కానీ కృషి, పట్టుదల ఉండాలే కానీ అది ప్రైవేట్ స్కూల్ అయినా ప్రభుత్వ స్కూల్ అయినా ఒక్కటే అని రితిక నిరూపించింది. కష్టపడి చదువుకుంటే ఎలాంటి కోచింగ్ సెంటర్లు అవసరం లేదని ప్రూవ్ చేసి విద్యార్థులకు ఆదర్శంగా నిలిచింది రితిక.