Jantar Mantar Protest : ఢిల్లీ నిరసనలపై షాకింగ్ రిపోర్ట్.. 2,873 మంది నేర చరిత్ర ఉన్నవారిని గుర్తించిన పోలీసులు
Delhi Police Riport : పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జంతర్ మంతర్ వద్ద నిరసనల్లో పాల్గొన్న వారిలో మొత్తం 2,873 మందికి నేర చరిత్ర ఉందని గుర్తించారు.
Delhi Police Riport
Jantar Mantar Protest Criminal Antecedents : నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులు పెద్దెత్తున ఆందోళనలు నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే, ఈ నిరసన కార్యక్రమాలపై ఢిల్లీ పోలీసులు కీలక వివరాలు వెల్లడించారు. ముఖ గుర్తింపు (Facial Recognition) సాంకేతికత, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిర్వహించిన పరిశీలనలో మొత్తం 2,873 మంది నేర చరిత్ర కలిగిన వ్యక్తులు నిరసనల్లో పాల్గొన్నట్లు గుర్తించినట్టు ఢిల్లీ పోలీసులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జంతర్ మంతర్ వద్ద నిరసనల్లో పాల్గొన్న వారిలో మొత్తం 2,873 మందికి నేర చరిత్ర ఉందని, వీరిలో 989 మందిపై గతంలో క్రిమినల్ కేసులు ఉన్నాయని తెలిపారు. ఈ 989 మందిలో 101 మంది హత్య కేసుల్లో నిందితులు కాగా.. 284 మంది దోపిడీ, దొంగతనం వంటి కేసుల్లో ఉన్నారు. 92 మంది అత్యాచారం, మహిళలు, చిన్నారులపై నేరాలకు సంబంధించిన కేసుల్లో నిందితులుగా ఉన్నారు. ఆరుగురిపై పోక్సో కేసులు ఉన్నాయి. వీరిలో చాలామందిపై ఒకటి కంటే ఎక్కువ క్రిమినల్ కేసులు నమోదైనట్లు దర్యాప్తులో గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
జూలై 20 నుంచి 25 వరకు జంతర్‌మంతర్ పరిసరాల్లో జరిగిన నిరసనల్లో పాల్గొన్న వారిని సీసీటీవీ ఫుటేజీ, డిజిటల్ విశ్లేషణ ద్వారా గుర్తించినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ వివరాలను సంబంధిత దర్యాప్తు సంస్థలకు కూడా అందజేసినట్లు సమాచారం. అయితే, నిరసనల సందర్భంగా పోలీసులపై దాడులు, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, వాహనాల విధ్వంసం జరిగిన ఘటనలపై దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజీ, వీడియోలు, డిజిటల్ ఆధారాలను విశ్లేషిస్తూ హింసాత్మక ఘటనల్లో పాల్గొన్న వారిని గుర్తిస్తున్నట్లు వెల్లడించారు.
