ఢిల్లీలో నేపాల్ బాలికల అక్రమ రవాణా: రక్షించిన మహిళా కమిషన్ 

  • Published By: veegamteam ,Published On : April 2, 2019 / 03:50 AM IST
ఢిల్లీలో నేపాల్ బాలికల అక్రమ రవాణా: రక్షించిన మహిళా కమిషన్ 

Updated On : April 2, 2019 / 3:50 AM IST

ఢిల్లీ : ఉద్యోగాల పేరుతో యువతుల అక్రమ రవాణా దారుణాలు ఏమాత్రం ఆగటంలేదు. గల్ఫ్ దేశాల్లో తక్కువ పని ఎక్కువ జీతం అని నమ్మబలికి అమ్మాయిలను సంతల్లో పశువుల్లాగా అమ్మివేస్తున్న దగా కోరులు ఆగడాలకు అంతులేకుండా పోతోంది. ఈ క్రమంలో నేపాల్ కు చెందిన 16మంది  బాలికలను ఢిల్లీ మహిళా కమిషన్ చొరవతో బైటపడ్డారు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. 
 

గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాలిప్పిస్తామని చెప్పి 16 మంది నేపాల్ బాలికలను అక్రమంగా తరలించేందుకు ఓ ఏజెంటు యత్నిస్తుండగా మహిళా కమిషన్ సభ్యురాలు కిరణ్ నేగి చొరవతో వారికి విముక్తి దొరికింది. ఉదయ్ అనే  (నకిలీ) ఏజెంటు 16 మంది నేపాల్ బాలికలకు దుబాయ్ లో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికి ఢిల్లీలోని నజాఫ్ ఘడ్ ప్రాంతానికి తీసుకువచ్చాడు. ఈ  సమాచారం అందుకున్న కిరణ్ నేగి రెండు బృందాలను నజాఫ్ ఘడ్ కు పంపించి ఉదయ్ నుంచి కాపాడారు. 
 

బాధితుల వివరాల ప్రకారం..ఉద్యోగం పేరుతో ఉదయ్ ఒక్కొక్కరి  వద్దా రూ.2 లక్షల వరకు వసూలు చేశాడని నేపాల్ యువతులు తెలిపారు.  ఈ విషయంపై కిరణ్ నేగి బాలికలతో పోలీస్ కంప్లైంట్ ఇప్పించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నకిలీ ఏజెంట్ ఉదయ్ కోసం గాలిస్తున్నారు.