Delimitation: మరో 25 ఏళ్లు డీలిమిటేషన్ చేయొద్దని జేఏసీ తీర్మానం.. ఎందుకో చెప్పిన కేటీఆర్, కనిమొళి

దక్షిణాది మొత్తం నష్టపోతుందని తెలిపారు. జనాభా ఆధారంగా సీట్ల సంఖ్యను పెంచాలని అనుకోవడం సమాఖ్య స్ఫూర్తికి విఘాతమని చెప్పారు.

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆధ్వర్యంలో శనివారం చెన్నైలో డీలిమిటేషన్‌పై మొదటి జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) సమావేశం జరిగింది. ఇందులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేరళ సీఎం పినరయి విజయన్, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ పాల్గొన్నారు.

కర్ణాటక నుంచి ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ హాజరయ్యారు. తెలంగాణ నుంచి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్‌ కూడా ఇందులో పాల్గొన్నారు.

డీలిమిటేషన్‌పై జేఏపీ ఓ తీర్మానం చేసి ఆమోదించింది. పాతికేళ్ల వరకు నియోజకవర్గాల సంఖ్య పెంచొద్దని ఉన్న నిబంధనను మరో 25 సంవత్సరాలు పొడిగించాలని తీర్మానంలో పేర్కొంది. డీలిమిటేషన్ ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వం పారదర్శకతను పాటించాలని జేఏసీ చెప్పింది. జేఏసీ తీర్మానాన్ని డీఎంకే ఎంపీ కనిమొళి చదివి వినిపించారు.

కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఏ డీలిమిటేషన్ ప్రక్రియ అయినా ప్రజాస్వామ్యాన్ని మరింత బలపర్చేలా పారదర్శకంగా ఉండాలని చెప్పారు. అన్ని రాష్ట్రాల రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలకు దానిపై చర్చించడానికి వీలు కల్పించాలని అన్నారు.

Also Read: వాళ్లలా మోదీ డీలిమిటేషన్ చేయాలి.. ఈ పద్ధతి పాటిస్తే సరీ..: రేవంత్‌ రెడ్డి

కాగా, డీలిమిటేషన్‌పై మీడియాతో కేటీఆర్ మాట్లాడారు. నియోజక వర్గాల పునర్విభజనను ప్రశ్నించకపోతే తమను చరిత్ర క్షమించదని చెప్పారు. దీనిపై అన్ని రాష్ట్రాలు ఏకమవ్వాలన్నారు. డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగనుందని చెప్పారు. ఈ రాష్ట్రాలపై కేంద్ర సర్కారు వివక్ష చూపుతోందని తెలిపారు.

దాని వల్ల తెలంగాణలోనూ నియోజకవర్గాల సంఖ్య తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దక్షిణాది మొత్తం నష్టపోతుందని తెలిపారు. జనాభా ఆధారంగా సీట్ల సంఖ్యను పెంచాలని అనుకోవడం సమాఖ్య స్ఫూర్తికి విఘాతమని చెప్పారు. అభివృద్ధిలో మందున్న రాష్ట్రాలకు దీని వల్ల నష్టం జరుగుతుందని తెలిపారు.

దేశ అభివృద్ధి కోసం పని చేసిన రాష్ట్రాలకు డీలిమిటేషన్ వల్ల నష్టం జరుగుతుందని అన్నారు. మనమంతా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామని చెప్పారు. దేశ అభివృద్ధిలో ముందు వరుసలో ఉన్న రాష్ట్రాలకు నష్టం కలిగిస్తూ… దేశాన్ని వెనక్కి నడుస్తున్న రాష్ట్రాలకి ఈ డిలిమిటేషన్ విధానం లాభం చేకూరుస్తుందని చెప్పారు.