మోడీ మరో సంచలన నిర్ణయం: నోట్ల రద్దు ప్రకటన చేసిన రోజే!

  • Publish Date - October 30, 2019 / 10:20 AM IST

దేశంలో నల్లధనం నిర్మూలించేందుకు పెద్ద నోట్లను రద్దు చేసింది మోడీ ప్రభుత్వం. అయితే ఈసారి భారతీయ మహిళల బంగారంపై కొరడా ఝులిపించేందుకు రెడీ అయింది కేంద్రం. ఇబ్బడిముబ్బడిగా బంగారం కొనేవారు లెక్కలు చెప్పాలంటూ ఆంక్షలు విధించేందుకు సిద్ధం అయ్యింది. ఆమ్నెస్టీ తరహా చట్టం తీసుకుని వచ్చి పుత్తడిపై పెట్టుబడులు పెడుతున్న వారి నుంచి పన్నుల వసూలు చేయాలని ప్లాన్‌ చేస్తోంది. ఈ కొత్త చట్టం ప్రకారం ఒక కుటుంబానికి పరిమితికి మించి బంగారం ఉంటే కేంద్రం దానిని స్వాధీనం చేసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

పెద్దమొత్తంలో నల్లడబ్బును పసిడిలో పెట్టుబడి కింద పెడుతుండడంతో ఈ మేరకు కేంద్రం నిర్ణయం తీసుకునేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. దీంతో నల్లధనాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. 8 నవంబర్ 2016 తేదీన డీమానిటైజేషన్‌ను మోడీ ప్రకటించారు. ఈ క్రమంలోనే నవంబర్ నెలలో నోట్ల రద్దు ప్రకటించిన రోజే ఈ నిర్ణయంపై ప్రధాని ప్రకటించే అవకాశం ఉంది. అయితే, దీనిపై అధికారిక సమాచారం ఇంకా బయటకు రాలేదు.

కొత్తగా తీసుకుని రాబోతున్న చట్టం ప్రకారం.. పెళ్లైన మహిళల దగ్గర ఇప్పటికే ఉన్న బంగారం పరిమితికి మించి మరికొంత మినహాంపు ఇచ్చే అవకాశం కూడా ఉంది.  అలాగే ఒక సంస్థ 20 కిలోల వరకు బంగారం ఉంచుకునే అవకాశం ఇవ్వనున్నారు. అలాడే ఒక కుటుంబం 4 కిలోల వరకు బంగారం ఉంచుకోవచ్చని అంతకు మించి ఉంటే మాత్రం కేంద్రం స్వాధీనం చేసుకుంటుందని అంటున్నారు. కొత్త చట్టం ప్రకారం నిర్దేశిత గడువులోగా బంగారం గురించి వివరాలు చెప్పకపోతే భారీగా జరిమానాలు విధించే అవకాశం కూడా ఉంది. బ్యాంకు లాకర్లలో కూడా సోదాలు చేసి బంగారం వివరాలను సేకరించేందుకు చట్టం తీసుకుని రానుంది కేంద్రం.