విడాకులు తీసుకున్న మహిళలే అతని టార్గెట్..ఏం చేస్తాడంటే

DIVORCE MATRIMONY : విడాకులు తీసుకున్న మహిళలే అతని టార్గెట్. వారిని ఆకర్షించే ప్రయత్నం చేస్తూ..మగ్గులోకి దించుతాడు. వివాహం చేసుకుంటానని నమ్మిస్తాడు. ఖరీదైన బహుమతులు పంపించాలని తప్పుడు కారణం చెబుతూ..వారి నుంచి డబ్బులు దండుకొనేవాడు. ఖాతాలో డబ్బులు జమ కాగానే..వెంటనే విత్ డ్రా చేసుకుని మోసం చేసేవాడు.
దక్షిణ ఢిల్లీలోని కోట్ల ముబారక్ పీఎస్ లో ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ‘DIVORCE MATRIMONY’ మ్యాట్రిమోని సైట్ చూసింది. అక్కడ తనకు తాను బ్రిటీష్ పౌరుడిగా పరిచయం చేసుకున్న విశాల్ ను సంప్రదించింది. వివరాలు పంపించి వివాహం చేసుకుంటానని హామీనిచ్చాడు. కొంత డబ్బు అవసరమని ఒప్పించడంతో అతని ఖాతాలో నగదు వేయడం జరిగిందని వాపోయింది.
వాట్సప్ కాలింగ్, ఛాటింగ్ ద్వారానే సంప్రదించాడని తెలిపింది. మొత్తం ఆన్ లైన్ ద్వారా రూ. 1, 21, 900 బదిలీ చేసినట్లు చెప్పింది. డబ్బులు వచ్చిన తర్వాత ఎలాంటి కాల్స్, ఛాట్స్ చేయడం లేదని తెలిపింది. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దేశ రాజధానిలో మునిర్క ప్రాంతంలో నివాసం ఉండే..విశాల్ అలియాస్ మోహిత్ టోకాస్ గా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
విశాల్ ఉపయోగిస్తున్న నాలుగు బ్యాంకు ఖాతాలను స్తంభింప చేశారు. అందులో రూ. 4.5 లక్షల నగదు ఉన్నట్లు గుర్తించినట్లు సౌత్ ఢిల్లీలోని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) అతుల్ థాకర్ వెల్లడించారు. ఇంకా ఎలాంటి నేరాలకు పాల్పడ్డాడు ? ఎంత మంది మహిళలను మోసం చేశాడో దర్యాప్తులో తేలనుంది.