Jawaharlal Nehru
Independence Day : 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఎర్రకోట వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం 10వ సారి జాతిని ఉద్దేశించి ఎర్రకోట నుంచి మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా పలు విషయాలను ప్రముఖంగా ప్రధాని ప్రస్తావించారు. దాదాపు గంటన్నర పాటు నరేంద్ర మోదీ ప్రసంగం సాగింది. అయితే, భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 77ఏళ్లలో ఎర్రకోటపై అత్యధిక ప్రసంగాలు చేసిన ప్రధానుల్లో మోదీకంటే ముందు వరుసలో మరో ఇద్దరు ప్రధానులు ఉన్నారు.
జవహర్ లాల్ నెహ్రూ ప్రధాని హోదాలో 17సార్లు ఎర్రకోట వేదికగా జాతినుద్దేశించి ప్రసంగించారు. ఆ తరువాతి స్థానంలో ఇందిరా గాంధీ ఉన్నారు. ఆమె 16సార్లు ఎర్రకోట వేదికగా జాతినుద్దేశించి ప్రసంగించారు. ఆ తరువాత స్థానంలో యూపీఏ హయాంలో పదేళ్లు ప్రధానిగా సాగిన మన్మోహన్ సింగ్ ఉన్నారు. ఆ సమయంలో పది సార్లు ఎర్రకోట వేదికగా మన్మోహన్ సింగ్ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ ముగ్గురు కాంగ్రెస్ పార్టీ ప్రధానులే కావటం విశేషం. కాంగ్రెసేతర ప్రధానుల్లో తాజాగా నరేంద్ర మోదీ మన్మోహన్ సింగ్ రికార్డును సమం చేశారు. నరేంద్ర మోదీ మంగళవారం ఎర్రకోట వద్ద జరిగిన 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం 10వ సారి జాతినుద్దేశించి ప్రసంగించారు.
PM Narendra Modi: మధ్యతరగతి ప్రజల సొంతింటికల సాకారానికి కొత్త పథకం.. ప్రధాని మోదీ కీలక ప్రకటన
– 1947 నుంచి 1963 వరకు ప్రధానిగా జవహర్ లాల్ నెహ్రూ ఎర్రకోటపై 17సార్లు ప్రసంగాలు చేశారు.
– ఇందిరాగాంధీ ప్రధాని హోదాలో 1966 నుంచి 1976 మధ్య 11 సార్లు జాతినుద్దేశించి ఎర్రకోట వేదికగా ప్రసంగించారు. మళ్లీ 1980 నుంచి ఆమె మరణించిన సంవత్సరం 1984 వరకు అంటే ఐదేళ్లు ఎర్రకోటపై జాతినుద్దేశించి ప్రసంగించారు.
– 2004 నుంచి 2013 వరకు ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ కొనసాగారు. ఆ పదేళ్ల కాలంలో ఎర్రకోట నుంచి పదిసార్లు ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు.
– 2014 నుంచి ప్రధానిగా మోదీ కొనసాగుతున్నారు. 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొని 10వ సారి జాతినుద్దేశించి మోదీ ప్రసంగించారు.