Long Range Anti Ship Missile
Long Range Anti-Ship Missile : 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా అంబరాన్నంటాయి. న్యూఢిల్లీలో జరిగిన గణతంత్ర వేడుకల్లో భాగంగా కవాతు ప్రదర్శనలో డీఆర్‌డీఓ లాంగ్‌రేంజ్ యాంటీ షిప్ హైపర్‌సోనిక్ గ్లైడ్ మిసైల్ (LRASHM)ను ప్రదర్శించింది. ఈ ఆయుధ వ్యవస్థ భారత నావికాదళంలో కీలక భూమిక పోషించనుంది.
లాంగ్‌రేంజ్ యాంటీ షిప్ హైపర్‌సోనిక్ గ్లైడ్ మిసైల్ (LRASHM) స్థిరంగా ఉండే, కదులుతున్న లక్ష్యాలను వేగంగా, అత్యంత కచ్చితత్వంతో ఛేదించగలదు. సముద్రంపై సుదూరంగా ఉన్న శత్రు దేశాల యుద్ధ నౌకలను చిత్తు చేస్తోంది. ఈ క్షిపణి పరిధి 1500 కిలోమీటర్లు. శబ్ద వేగానికి ఐదు రెట్ల కంటే అధిక వేగంతో ఈ క్షిపణి ప్రయాణించగలదు. అంటే.. సుమారు గంటలకు 6,100 కిలో మీటర్లు వేగంతో ప్రయాణిస్తుంది. సముద్ర జలాల్లో వేగంగా ప్రయాణించే యుద్ధ నౌకలను ఈ క్షిపణి కచ్చితత్వంతో గుర్తించి 100శాతం ధ్వంసం చేస్తుంది.
లాంగ్‌రేంజ్ యాంటీ షిప్ హైపర్‌సోనిక్ గ్లైడ్ మిసైల్‌ను ప్రత్యేకంగా తయారు చేసిన మొబైల్ లాంఛర్ నుంచి ప్రయోగిస్తారు. బూస్ట్ అండ్ గ్లైడ్ సాంకేతికతను దీనికి వినియోగించారు. దీంతో ప్రయోగించిన క్షణాల్లోనే గరిష్ఠ వేగంతో దూసుకెళ్తోంది. అంత స్పీడ్‌లో కూడా శత్రు దేశాల రాడార్లు, గగనతల రక్షణ వ్యవస్థలకు దొరక్కుండా తన దిశను మార్చుకునే సామర్థ్యం దీనికి ఉంది.
దీనికి ఘన ఇంధన ఇంజిన్ అమర్చారు. దాంతో సుమారు 30కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంటుంది. అక్కడి నుంచి రాకెట్ ఇంజిన్ విడిపోతుంది. దీనికి అమర్చిన గ్లైడ్ వెహికిల్ లక్ష్యం దిశగా దూసుకెళ్తుంది. హైపర్ సోనిక్ వేగంతో ప్రయాణించే ఈ క్షిపణిని శత్రుదేశ యుద్ధనౌక రాడార్లు గుర్తించేలోపే పని పూర్తవుతుంది. ఇందుకోసం ఏరో డైనమిక్ డిజైన్‌తో ప్రత్యేకంగా తీర్చిదిద్దారు.
సముద్ర జలాల్లోని శత్రు నౌకలపై విరుచుకుపడటమే కాదు.. భూ ఉపరితలాలపై ఉన్న లక్ష్యాలను కూడా సునాయాసంగా ఈ లాంగ్‌రేంజ్ యాంటీ షిప్ హైపర్‌సోనిక్ గ్లైడ్ మిసైల్ ఛేదిస్తుంది. శత్రుదేశ రాడార్లు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు దీని రాకను గుర్తించలేవు. ఎలాంటి యుద్ధనౌకలనైనా క్షణాల్లో ధ్వంసం చేస్తుంది.
లాంగ్‌రేంజ్ యాంటీ షిప్ హైపర్‌సోనిక్ గ్లైడ్ మిసైల్ మరో ప్రత్యేక ఏమిటంటే.. అతి తక్కువ ఎత్తులోనే ప్రయాణిస్తూ లక్ష్యాలను చేరుకోగలదు. అన్ని రకాల పేలోడ్‌లనూ మోసుకెళ్లగలదు. అతి తక్కువ ఎత్తులోనే ప్రయాణిస్తూ లక్ష్యాలను చేరుకోగలగడం దీనికున్న ప్రత్యేకత. అన్ని రకాల పేలోడ్‌లనూ మోసుకెళ్ళడానికి రూపొందించబడింది.