Early Polls: ఐదు రాష్ట్రాల ఎన్నికలతోపాటు… కేంద్రంలో ముందస్తు ఎన్నికలు జరగనున్నాయా?

మరో ఏడెనిమిది నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనుండటం.. త్వరలో ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో కేంద్రంలో మళ్లీ ముందస్తు ఎన్నికల ప్రస్తావన వస్తోంది.

Early Lok Sabha polls on cards says top political leaders

Early Lok Sabha Polls: కేంద్రంలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయా? జరిగితే కేంద్రంతోపాటు ఏపీ ఎన్నికలు ఉంటాయా? డిసెంబర్‌లో ఎన్నికలకు కేంద్రం సన్నాహాలు చేస్తుందని బెంగాల్ సీఎం మమతాబెనర్జీ (Mamata Banerjee), బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ (Nitish Kumar) వ్యాఖ్యల్లో నిజమెంత? బీజేపీ గేమ్ ప్లాన్ (BJP Game Plan) ఏంటి? ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నందున.. వాటితోపాటే ఎన్నికలకు వెళ్లాలని బీజేపీ సర్కార్ భావిస్తుందా? అసలు బీజేపీ ప్రయత్నాలు ఎలా ఉన్నాయి? కాంగ్రెస్ కూటమి I.N.D.I.A. అంచనాలు ఏంటి? కేంద్ర రాజకీయాలపై టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ఏమన్నారు?

దేశ రాజకీయాల్లో ముందస్తు ఎన్నికలపై ఒకటే చర్చ జరుగుతోంది. కేంద్రంలో ప్రధాని మోదీ రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత జమిలి ఎన్నికలు దిశగా కొద్ది రోజులు ప్రయత్నాలు జరిగాయి. దేశంలో ఎప్పటికప్పుడు ఏదో రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నందున అభివృద్ధికి ఆటంకం కలుగుతోందని భావించిన ప్రధాని మోదీ.. దేశమంతా ఒకేసారి ఎన్నికలకు మొదట్లో మొగ్గు చూపారు. కానీ, ఇది కేవలం ప్రతిపాదనగానే మిగిలిపోయింది. ఎందుకనో కొన్నేళ్లుగా ఈ దిశగా ఎలాంటి అడుగులు పడలేదు. ఐతే మరో ఏడెనిమిది నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనుండటం.. త్వరలో ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో కేంద్రంలో మళ్లీ ముందస్తు ఎన్నికల ప్రస్తావన వస్తోంది.

ఐదు రాష్ట్రాల ఎన్నికలతోపాటు ఒడిశా, ఏపీ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వానికి ఎన్నికలు నిర్వహించే దిశగా బీజేపీ అడుగులు వేస్తోందని విపక్షాలు అనుమానిస్తున్నాయి. తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గడ్, రాజస్థాన్, మిజోరాం రాష్ట్రాలకు డిసెంబర్‌లోగా ఎన్నికలు జరగాల్సివుంది. ఇక కేంద్ర ప్రభుత్వంతోపాటు ఏపీ, ఒడిశాలకు ఎన్నికలు జరగాల్సివుంది. ఏపీలో కొన్నాళ్లుగా ముందస్తకు వెళతారనే ప్రచారం జరిగినా.. సీఎం జగన్ అలాంటి ప్రతిపాదన ఏమీ లేదని కొట్టిపడేశారు. కానీ, పక్కనే ఉన్న ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ముందస్తుకు సన్నాహాలు చేస్తున్నారనే ప్రచారంతో కేంద్రంపై అనుమానాలు ఎక్కువవుతున్నాయి.

ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ జాతీయ రాజకీయాలపై తటస్థంగా వ్యవహరిస్తున్నారు. కానీ అవసరమైనప్పుడు బీజేపీకి అండగా నిలుస్తుంటారు. వచ్చే ఏడాది జూన్‌ వరకు ఒడిశా ప్రభుత్వానికి గడువు ఉన్నప్పటికీ.. ఈ డిసెంబర్‌లోనే ఎన్నికలు ఎదుర్కోవాలని నవీన్ ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్నికల కమిషన్ అధికారులు కూడా ఆ రాష్ట్రంలో పర్యటించడం అనుమానాలను పెంచేస్తోంది. ఇదే సమయంలో డిసెంబర్‌లో ఎన్నికల నిర్వహణకు బీజేపీ ఆలోచిస్తోందని.. దేశంలో ఉన్న హెలికాప్టర్లన్నీ ముందుగానే బుక్ చేసేసుకుందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపిస్తున్నారు. ఎన్నికలకు వెళ్లే ఉద్దేశం లేకపోతే హెలికాప్టర్‌లను ఎందుకు బుక్ చేసుకుంటారని ప్రశ్నిస్తున్నారు దీదీ. ఇదే అనుమానం బిహార్ సీఎం నితీశ్‌కుమార్ వ్యక్తం చేస్తున్నారు. ఐతే కేంద్ర ప్రభుత్వం మాత్రం విపక్షాల కామెంట్లపై అస్సలు స్పందించడం లేదు. తన పని తాను చేసుకుంటానన్నట్లు గుట్టుచప్పుడు కాకుండా రాజకీయం చేస్తోంది. ఐతే బీజేపీ అడుగులను పరిశీలిస్తున్న రాజకీయ పరిశీలకులు.. కేంద్రం ముందస్తు ఎన్నికలకు వెళ్లే చాన్సే ఎక్కువగా ఉందని అంటున్నారు.

Also Read: లోకేశ్ వద్దు, చంద్రబాబు మద్దు..! టీడీపీలో ఏం జరుగుతోంది? అంతుచిక్కని ఆ ఇద్దరు ఎంపీల తీరు

ప్రధాని మోదీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటై తొమ్మిదేళ్లు గడిచాయి. కర్ణాటక ఎన్నికల వరకు దేశంలో బీజేపీ బలంగా ఉందనే ప్రచారం జరిగింది. 2014 నుంచి కర్ణాటక ఎన్నికల ముందు వరకు వరుసగా ఒక్కోరాష్ట్రాన్ని గెలుస్తూ వచ్చిన బీజేపీకి కర్ణాటకలో మాత్రం షాక్ తగిలింది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా అనూహ్యంగా పుంజుకుంది కాంగ్రెస్. కర్ణాటక జోష్‌తో తెలంగాణలో అసలు సోదిలోనే లేదనుకున్న కాంగ్రెస్ ప్రధాన పోటీదారుగా ఆవిర్భవించగా, అప్పటివరకు జోరు చూపించిన బీజేపీ డీలాపడిపోయింది. అంతేకాకుండా జోడోయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లిన రాహుల్‌గాంధీ కూడా దేశ రాజకీయాల్లో జోరు పెంచారు. మరికొన్నాళ్లు సమయం ఇస్తే రాహుల్ ఇమేజ్ మరింత పెరిగే అవకాశం ఉందని అనుమానిస్తోంది బీజేపీ. 2019లో మా ప్రధాని అభ్యర్థి మోదీ.. మీ ప్రధాని ఎవరు? అని కాంగ్రెస్‌ను ప్రశ్నించి ఓటు యుద్ధంలో దెబ్బతీసింది కమలం పార్టీ. ఆ ఎన్నికలకు ముందు రాహుల్ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని వదిలేసి అస్త్ర సన్యాసం చేశారు. ఇప్పుడు మాత్రం తనే సైనికుడిగా యుద్ధ క్షేత్రంలో తలపడే ప్రయత్నం చేస్తున్నారు.

Also Read: అమెరికాకు వెళ్లనున్న బండి సంజయ్.. 10 రోజులపాటు యూఎస్ లోనే

ఈ పరిస్థితుల్లో నిర్దేశిత సమయం ప్రకారం ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ నుంచి సవాల్ ఎదురయ్యే అవకాశం ఉందని అనుమానిస్తోంది బీజేపీ. అందుకే డిసెంబర్‌లోనే ఎన్నికలకు వెళితే రాహుల్‌ను, కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయొచ్చని భావిస్తోంది. ఇదేసమయంలో కర్ణాటక ఎన్నికల తర్వాత ఏకమవుతున్న ప్రతిపక్షాలకు మరింత సమయం ఇవ్వకూడదని భావిస్తోంది బీజేపీ. ప్రస్తుతం ప్రతిపక్ష ఇండియా కూటమికి ఇంతవరకు కన్వీనర్ లేరు. ప్రధాని అభ్యర్థి ఎవరో కూడా చెప్పలేదు. ముంబైలో గురు, శుక్రవారాల్లో జరిగే సమావేశాల్లో కన్వీనర్‌ను ఎన్నుకుంటారా? లేదా? అనేది స్పష్టత లేదు. అందుకే రాజకీయాల్లో తలపండిన సీనియర్ నేత చంద్రబాబు కూడా విపక్ష కూటమికి నాయకత్వం లేకపోవడం బీజేపీకే లాభిస్తుందని వ్యాఖ్యానించారు. మరోవైపు మహారాష్ట్రలో ప్రస్తుతం రాజకీయం గందరగోళంగా మారింది. అక్కడ ఏ పార్టీ పూర్తిగా కోలుకోకముందే దెబ్బతీయాలంటే ముందస్తు ఒక్కటే మందని బీజేపీ భావిస్తున్నట్లు చెబుతున్నారు.

Also Read: 200వ రోజుకు చేరిన నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర.. చంద్రబాబు ఆసక్తికర ట్వీట్..

మరోవైపు ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఏమైన ప్రతికూల ఫలితాలు వస్తే అసలుకే మోసం వస్తుందని భయం కూడా బీజేపీలో ఉంది. కర్ణాటక మాదిరిగా ఏదైనా తేడా జరిగితే.. ఆ ప్రభావం సార్వత్రిక ఎన్నికలపై కచ్చితంగా పడుతుందని భయపడుతున్నారు కమలనాథులు. ప్రతిపక్షాలను దెబ్బతీయాలన్నా.. ఐదు రాష్ట్రాల ఫలితాల ప్రభావం కేంద్రంపై పడకూడదన్నా ముందస్తు ఎన్నికలకు వెళ్లడమే మంచిదనే అంచనాలతోనే వివిధ రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులను మార్చుతున్నారని చెబుతున్నారు. మొత్తానికి అన్నివైపుల నుంచి ఆలోచిస్తున్న కమలదళం సార్వత్రిక సమరానికి సన్నాహాలు చేస్తోందన్న ప్రచారమే దేశవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా వినిపిస్తోంది.

ట్రెండింగ్ వార్తలు