TDP MPs : లోకేశ్ వద్దు, చంద్రబాబు మద్దు..! టీడీపీలో ఏం జరుగుతోంది? అంతుచిక్కని ఆ ఇద్దరు ఎంపీల తీరు

ఢిల్లీలో ఒకలా, ఏపీలో ఇంకోలా ఉంటున్న ఆ ఇద్దరి ఎంపీల తీరు పార్టీ పెద్దలకు అర్ధం కావడం లేదట. TDP MPs - Nara Lokesh

TDP MPs : లోకేశ్ వద్దు, చంద్రబాబు మద్దు..! టీడీపీలో ఏం జరుగుతోంది? అంతుచిక్కని ఆ ఇద్దరు ఎంపీల తీరు

TDP MPs - Nara Lokesh

TDP MPs – Nara Lokesh : తెలుగుదేశం పార్టీకి ఉన్నది ముగ్గురు ఎంపీలు. ఆ ముగ్గురిలో ఇద్దరి రూటే సెపరేటు. క్షేత్రస్థాయిలో పార్టీ పనులు అంటే ఏవేవో కారణాలు చెప్పి తప్పించుకుంటారు. అధినేత పనులు అంటే మాత్రం ప్రత్యేక ఇంట్రస్ట్ తో ఠంచన్ గా హాజరైపోతారు. పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న లోకేశ్ యువగళం పాదయాత్రకు డుమ్మాకొడతారు. చంద్రబాబు వస్తున్నారంటే అందరికన్నా ముందుగా ప్రత్యక్షం అవుతారు. ఏపీలో ఉంటే ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. ఢిల్లీలో ఉంటే ఇద్దరిదీ ఒకే స్టైల్. బాబుకు జై.. లోకేశ్ కు నై.. అన్నట్లుగా సాగుతోంది వారి రాజకీయం. ఢిల్లీలో ఒకలా, ఏపీలో ఇంకోలా ఉంటున్న ఆ ఇద్దరి ఎంపీల తీరు పార్టీ పెద్దలకు అర్ధం కావడం లేదట.

పార్టీ కార్యక్రమాలకు దూరం..
టీడీపీలోని ఇద్దరు ఎంపీల తీరు ఆ పార్టీని గందరగోళానికి గురి చేస్తోందట. గత ఎన్నికల్లో వైసీపీ హవాలోనూ గెలిచిన ముగ్గురు ఎంపీల్లో ఇద్దరు ఎప్పుడూ పార్టీ కార్యక్రమాలకు హాజరుకావడం లేదు. ఆ ఇద్దరిలో ఒకరు విజయవాడ ఎంపీ కేశినేని నాని. మరొకరు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్. ప్రస్తుతానికి ఈ రెండు నగరాలను ఏపీకి రాజధానిగానే భావిస్తోంది టీడీపీ.

ఒకరికి విభేదాలు, మరొకరికి వ్యాపారాలు..
అత్యంత కీలకమైన ఈ రెండు సీట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు రకరకాల సాకులు చూపి పార్టీ కార్యక్రమాలకు డుమ్మా కొట్టడం షరా మామూలైంది. విజయవాడ ఎంపీ కేశినేనికి స్థానిక నాయకులతో విభేదాలు ఉండగా, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ వ్యాపారంలో బిజీగా ఉండటం వల్ల రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు చెబుతున్నారు.

Also Read..Minister Roja: రోజాకు ఆ ఐదుగురితో విభేదాలు.. వారికి మంత్రి పెద్దిరెడ్డి అండదండలు!

వైసీపీని చూసి భయపడుతున్నారా?
టీడీపీలో యాక్టివ్ గా ఉండే జయదేవ్ ను వైసీపీ టార్గెట్ చేయడం వల్ల కూడా ఆయన వెనక్కి తగ్గుతున్నారనే ప్రచారం ఉంది. ఈ కారణంతోనే సొంత నియోజకవర్గంలోనూ ఎంపీ జయదేవ్ పర్యటించడం లేదు. మరీ ముఖ్యంగా ఈ ఇద్దరి నియోజకవర్గాల్లోనూ నారా లోకేశ్ యువగళం పాదయాత్ర జరిగినప్పుడు మర్యాదపూర్వకంగానైనా కలవలేదు. ఎంపీ జయదేవ్ సొంత జిల్లా చిత్తూరులోనే లోకేశ్ యువగళం యాత్ర మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కేడర్ లోకేశ్ పాదయాత్ర ప్రారంభోత్సవానికి వెళ్లినా.. జయదేవ్ మాత్రం కనిపించలేదు. ఇక సొంత నియోజకవర్గం గుంటూరులోనూ జయదేవ్ జాడ లేదు.

లోకేశ్ పాదయాత్రకు డుమ్మా..
ఇదే విధంగా మరో ఎంపీ కేశినేని నాని సైతం లోకేశ్ పాదయాత్రకు ముఖం చాటేశారు. విజయవాడ నగరంలో లోకేశ్ యాత్రకు కేడర్ బ్రహ్మరథం పట్టినా.. సిట్టింగ్ ఎంపీ నాని కనీసం అటువైపు కూడా చూడలేదు. ఇదేమని ఎవరైనా ప్రశ్నిస్తే ఆ సమయంలో తీర్థయాత్రల్లో ఉన్నామని చెప్పుకొచ్చారు. తీర్థయాత్రలకు ముందు కానీ వెళ్లొచ్చిన తర్వాత కానీ లోకేశ్ ను కలవలేదు నాని.

ఇలా యువనేత పాదయాత్రకు డుమ్మా కొట్టడమే కాకుండా నియోజకవర్గంలోని పార్టీ కార్యక్రమాలకు కూడా అందుబాటులో ఉండటం లేదు ఈ ఇద్దరు ఎంపీలు. గుంటూరులో జయదేవ్ అసలు రాష్ట్ర రాజకీయాలతో సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తుండగా, విజయవాడ ఎంపీ కేశినేని నాని కొన్ని అధికారిక కార్యక్రమాలకు మాత్రమే హాజరవుతున్నారు.

Also Read..Dadi Veerabhadra Rao: దాడి వాడి ఎందుకు తగ్గిపోయింది.. మళ్లీ యాక్టివ్ అవుతారా?

సడెన్ యూటర్న్ ఇచ్చిన ఇద్దరు ఎంపీలు..
ఇలాంటి పరిస్థితుల్లో ఇద్దరు నేతలతో పార్టీకి బంధం తెగిపోయిందని అందరూ అనుకుంటూ ఉండగా.. సడెన్ యూటర్న్ తీసుకున్నారు ఎంపీలు నాని, జయదేవ్. ఢిల్లీలో సొంత పనుల కోసమో? అధినేతపై ప్రేమో? తెలియదు కానీ, చంద్రబాబు ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా ఎయిర్ పోర్టులో బాబు విమానం దిగిన దగ్గరి నుంచి మళ్లీ తిరిగి అమరావతి వచ్చే వరకు వెన్నంటే ఉంటున్నారు.

ఎంపీ గల్లాజయదేవ్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు చెప్పి లోక్ సభ సమావేశాలకు మాత్రం హాజరవుతున్నారు. అదే విధంగా చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఆయనతోనే ఉంటున్నారు. నాని సైతం బాబుతో దగ్గరగానే ఉంటూ పార్టీ పనులకు మాత్రం ముఖం చాటేస్తున్నారు.

ఎంపీల తీరుతో విస్మయం..
అధినేత చంద్రబాబు హస్తిన పర్యటనల్లో ఇద్దరు ఎంపీలు చేసే హడావుడి చూస్తున్న నేతలు విస్తుపోతున్నారు. రాష్ట్రంలో ఎప్పడూ కనిపించని ఎంపీలు ఢిల్లీలో చేసే హంగామాతో వారిని ఎలా అర్థం చేసుకోవాలో తేల్చుకోలేకపోతున్నారు. లోకేష్ విజయవాడ వస్తే కనీసం పలకరించని నాని, పుంగనూరులో చంద్రబాబు పై దాడి జరిగితే వెంటనే స్పందించి కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. ఇక తాజాగా ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు ఎన్నికల కమిషన్ ను కలిస్తే ఆయన పక్కనే తిరిగారు నాని.

లోకేశ్ వద్దు.. చంద్రబాబు ముద్దా..?
ఎంపీ గల్లా జయదేవ్ కూడా చంద్రబాబుతో రాసుకుపూసుకు తిరగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. టీడీపీ ఎంపీలుగా ఆ ఇద్దరు అధినేతను కలవడంపై ఎవ్వరికీ అభ్యంతరాలు లేనప్పటికీ లోకేశ్ పాదయాత్రకు ముఖం చాటేసి బాబు కార్యక్రమాలకు ఠంచన్ గా హాజరు కావడం మాత్రం ఆసక్తికర చర్చకు దారితీసింది. లోకేశ్ వద్దు.. బాబు ముద్దా అంటూ ఇద్దరు ఎంపీలపై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. అంతేకాకుండా ఎంపీలు ఇద్దరూ లోకేశ్ ను నాయకుడిగా గుర్తించడం లేదా? లేక లోకేశ్ తో తమకేం పని అని అనుకుంటున్నారా? అన్నది టీడీపీ శ్రేణుల్లో మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.