ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను వదలని ఈడీ.. విచారణకు రావాలంటూ మరోసారి సమన్లు జారీ

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఈడీ మరోసారి సమన్లు పంపించింది.

Delhi CM Arvind Kejriwal

CM Arvind Kejriwal : ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఆదివారం ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి సమన్లు పంపించింది. మార్చి 21న ఈడీ కార్యాలయానికి వచ్చి విచారణకు సహకరించాలని కేజ్రీవాల్ ను దర్యాప్తు సంస్థ కోరింది. ఇప్పటికే లిక్కర్ పాలసీ కేసులో విచారణకు హాజరు కావాలని ఢిల్లీ సీఎంకు ఎనిమిది సార్లు సమన్లు జారీ చేసిన ఈడీ.. తాజాగా తొమ్మిదోసారి సమన్లు జారీ చేసింది.

Also Read : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితను 7 రోజుల ఈడీ కస్టడీకి అప్పగించిన కోర్టు

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో విచారణకు రావాలని కేజ్రీవాల్ కు ఈడీ ఇప్పటికే ఎనిమిది సార్లు సమన్లు పంపించింది. అయితే, ఈడీ సమన్లు చట్టవిరుద్దమని, బీజేపీ కుట్రపూరిత రాజకీయాల్లో భాగంగానే లిక్కర్ పాలసీ కేసు అంటూ పేర్కొన్న కేజ్రీవాల్ ఈడీ సమన్లకు స్పందించలేదు. దీంతో తమ విచారణకు హాజరు కావటం లేదని పేర్కొంటూ ఈడీ ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టులో కేజ్రీవాల్ పై రెండు సార్లు ఫిర్యాదు చేసింది. ఈడీ సమన్ల కేసులో శనివారం ఉదయం కేజ్రీవాల్ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టుకు హాజరయ్యారు. అయితే, చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఆయనకు బెయిల్ మంజూరు చేశారు. బెయిల్ మంజూరైన మరుసటి రోజే కేజ్రీవాల్ కు మరోసారి (తొమ్మిదోసారి) ఈడీ సమన్లు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది.
Also Read : MCC: దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్.. ఏమేం చేయకూడదో తెలుసా?

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆమెను కోర్టులో హాజరుపర్చగా.. ఈనెల 23 వరకు కస్టడీ విధించింది. ఇదిలాఉంటే ఈడీ తొమ్మిదోసారి పంపించిన సమన్లకు కేజ్రీవాల్ ఏ విధంగా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. విచారణకు హాజరవుతారా.. మరేదైనా కారణాలతో ఈడీ విచారణకు కేజ్రీవాల్ దూరంగా ఉంటారా అనేది వేచిచూడాల్సి ఉంది. ఒకవేళ కేజ్రీవాల్ ఈడీ విచారణకు హాజరైతే కవితతో కలిపి ఆయన్ను విచారించాలని ఈడీ అధికారులు భావిస్తున్నట్లు సమాచారం.

ట్రెండింగ్ వార్తలు