ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితను 7 రోజుల ఈడీ కస్టడీకి అప్పగించిన కోర్టు

ఈడీ అధికారులు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు నిన్న అరెస్ట్ వారెంట్ ఇచ్చి అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితను 7 రోజుల ఈడీ కస్టడీకి అప్పగించిన కోర్టు

Delhi Liquor Scam Kavitha

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఏడు రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగిస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు నిర్ణయం తీసుకుంది. ఈడీ అధికారులు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు నిన్న అరెస్ట్ వారెంట్ ఇచ్చి అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అనంతరం గత రాత్రి ఢిల్లీకి తీసుకెళ్లారు.

ఆమెను ఇవాళ కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టులో వాదనలు ముగిశాయి. కవితను కస్టడీకి ఇవ్వాలని కోర్టు అడిగింది. తదుపరి విచారణ మార్చి 23 వాయిదా పడింది. కేసులో రెండు గంటల పాటు వాదనలుసాగాయి. లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో కవిత పాత్ర ఉందని ఈడీ చెప్పింది. తమ వద్ద ఆధారాలున్నాయని ఈడీ తెలిపింది.

ఎప్పుడేం జరిగింది?
ఢిల్లీ లిక్కర్ స్కాం 2022 జులై నుంచి డైలీ ఎపిసోడ్‌ అయిపోయింది. 2021లో ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చిన లిక్కర్ పాలసీలో.. ఆమ్ ఆద్మీ పార్టీకి లబ్ధి చేకూరేలా పెద్దఎత్తున స్కాం జరిగిందనేది ప్రధాన ఆరోపణ. లెఫ్ట్ నెంట్ గవర్నర్ ఆమోదం లేకుండా తెచ్చిన లిక్కర్ పాలసీలో.. చాలా అవకతవకలు జరిగాయని ఆరోపణలున్నాయి.

లిక్కర్ లైసెన్స్ ఫీజులో భారీగా మార్పులు, లైసెన్స్ కాలం పొడిగింపు, కరోనా సమయంలో రాయితీలు ఇచ్చారని అభ్యంతరం తెలిపారు ఢిల్లీ లెఫ్ట్ నెంట్ గవర్నర్. లిక్కర్ పాలసీ డిజైన్‌, అమలుపై దర్యాప్తు జరపాలని 2022 జులై 20న కేంద్ర హోంశాఖకు లేఖ కూడా రాశారు లెఫ్ట్ నెంట్ గవర్నర్ సక్సేనా.

తర్వాత ఢిల్లీ లిక్కర్ పాలసీపై సీబీఐ దర్యాప్తు మొదలైంది. 16మందితో మొదట ఛార్జిషీట్ దాఖలు చేసింది సీబీఐ. తర్వాత కేసులోకి ఈడీ ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఓవైపు సీబీఐ, మరోవైపు ఈడీ దర్యాప్తు చేస్తున్నాయి. స్కాం జరిగిన తీరు, అందులో పలువురి పాత్రపై సీబీఐ దర్యాప్తు చేస్తుంటే.. స్కాంలో భాగంగా జరిగిన మనీలాండరింగ్‌పై ఈడీ ఫోకస్ చేసింది. 2022 నవంబర్ 25న ఢిల్లీ లిక్కర్ స్కాంపై సీబీఐ తొలి ఛార్జిషీట్ వేసింది.

అందులో కవితకు అత్యంత సన్నిహితుడిగా చెప్పిన అభిషేక్‌ బోయిన్‌పల్లి పేరు ప్రస్తావించింది సీబీఐ. అరుణ్‌ రామచంద్ర పిళ్లై, సమీర్‌ మహేంద్రు పేర్లు కూడా సీబీఐ ఫస్ట్ చార్జిషీట్ లో ఉన్నాయి. ఆ తర్వాత లిక్కర్ స్కాంలో కవిత పాత్రపై కీలక ఆరోపణలు చేశాయి దర్యాప్తు సంస్థలు. ఢిల్లీ లిక్కర్ పాలసీను డిజైన్‌ చేసిందే కవిత ఆధ్వర్యంలోని సౌత్ గ్రూప్ అని ఆరోపించారు.

సౌత్ గ్రూప్‌లో అరుణ్ రామచంద్రపిళ్లై, అభిషేక్ బోయిన్‌పల్లి, బుచ్చిబాబు, మాగుంట రాఘవ, సమీర్ మహీంద్రు, శరత్ చంద్రారెడ్డి పేర్లను ప్రస్తావించాయి దర్యాప్తు సంస్థలు. వీళ్లందరినీ కవిత లీడ్ చేశారని..రాబిన్ డిస్టిలిరీ డైరెక్టర్ అరుణ్ రామచంద్రపిళ్లై కవితకు బినామీ అని ఆరోపించాయి దర్యాప్తు సంస్థలు.

వీళ్లందరూ అంతే.. 
ఆ తర్వాత సౌత్ గ్రూప్‌లో ఒకరి తర్వాత ఒకరిని.. ఈడీ, సీబీఐ అరెస్ట్ చేసి విచారించాయి. ఇందులో సమీర్ మహేంద్రు, శరత్‌చంద్రారెడ్డి బెయిల్ పై ఉన్నారు. అభిషేక్ బోయినపల్లి, మాగుంట రాఘవరెడ్డి విచారణను ఎదుర్కొంటున్నారు. ఈడీ కేసులో నిందితులకు ఫిబ్రవరి 16న బెయిల్ నిరాకరించింది ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు.

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో..ఫస్ట్ టైమ్‌ 2022 డిసెంబర్ 11న కవితను సీబీఐ ఆమె ఇంట్లోనే ప్రశ్నించింది. ఆ తర్వాత మూడునెలల తర్వాత 2023 మార్చి 11, 16, 20, 21 తేదీల్లో ఢిల్లీలోని ఈడీ ఆఫీస్‌లో కవితను విచారించారు అధికారులు. ఢిల్లీ లిక్కర్ స్కాం జరిగిందని చెప్తున్నప్పటి నుంచి వాడిన ఫోన్లను ఈడీకి సబ్మిట్ చేశారు ఎమ్మెల్సీ కవిత.

ఈ ఏడాది జనవరి 5న మరోసారి కవితకు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఫిబ్రవరి 21న సీబీఐ నోటీసులు ఇచ్చింది. ఆ నోటీసులో మొదటిసారి ఎమ్మెల్సీ కవితను ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితురాలిగా చేర్చింది సీబీఐ. అయితే ముందస్తు కార్యక్రమాలు ఫిక్స్ అయినందున విచారణకు రాలేనని నోటీసులకు రిప్లై ఇచ్చారు కవిత. అప్పటికే కవిత దాఖలు చేసిన పిటీషన్ సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది.

మహిళను ఈడీ ఆఫీస్‌కు పిలిపించి విచారించడంపై కోర్టులో పిటిషన్ వేశారు కవిత. ఏడాదిగా ఆ పిటీషన్ పెండింగ్ లో ఉంది. శుక్రవారం సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ విచారణకు వచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఈ గ్యాప్‌లోనే హైదరాబాద్‌లోని కవిత ఇంట్లో రైడ్స్ చేశారు ఈడీ అధికారులు. ఆ తర్వాత ఆమెను అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించారు.

RS Praveen Kumar: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన నిర్ణయం.. బీఎస్పీకి రాజీనామా.. కేసీఆర్‌తో భేటీ