Missing Person Found Alive : చనిపోయాడని అంత్యక్రియలు..భార్య మరో పెళ్లి..12ఏళ్ల తర్వాత..
12 ఏళ్ల క్రితం సడెన్ గా అదృశ్యమయ్యాడు. కుటుంబసభ్యులు దేశమంతా గాలించినా ఆచూకీ దొరకలేదు. చివరకి చనిపోయాడనుకొని అంత్యక్రియలు నిర్వహించారు. భర్త చనిపోయాడని భావించి రెండేళ్ల తర్వాత

Chhavi
Missing Person Found Alive : 12 ఏళ్ల క్రితం సడెన్ గా అదృశ్యమయ్యాడు. కుటుంబసభ్యులు దేశమంతా గాలించినా ఆచూకీ దొరకలేదు. చివరకి చనిపోయాడనుకొని అంత్యక్రియలు నిర్వహించారు. భర్త చనిపోయాడని భావించి రెండేళ్ల తర్వాత భార్య మరో పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. 12 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆ అదృశ్యమైన వ్యక్తి సజీవంగా ఉన్నట్లు తెలిసింది. ఇంతకీ అసలేం జరిగింది,ఇదంతా ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే 12 ఏళ్లు వెనక్కి వెళ్లాల్సిందే.
2009లో బీహార్ లోని బక్సర్ జిల్లాకు చెందిన ఛావీ కుమార్ అనే వ్యక్తి ఓ రోజు సడెన్ గా ఇంటి నుంచి అదృశ్యమయ్యాడు. అప్పుడు ఛావీ కుమార్ వయస్సు 23 సంవత్సరాలు. అదృశ్యమవ్వడానికి రెండెళ్ల ముందే ఛావీ కుమార్ కి పెళ్లి అయింది. అయితే తరుచూ అతడికి ఇంటి నుంచి అలా వెళ్లి తిరిగి రావడం ఛావీ కుమార్ కి అలవాటే. దీంతో ఛావీ కుటుంబసభ్యులు కూడా..తనే తిరిగొస్తాడులే అని కొద్ది రోజులు సైలెంట్ గా ఉన్నారు. అయితే రోజులు..నెలలు గడుస్తున్నా ఛావీ ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యుల్లో ఆందోళన మొదలైంది. ఛావీ కుమార్ గురించి వెతుకులాట మొదలుపెట్టారు. ఛావీ ఆచూకీ కోసం కుటుంబసభ్యులు గాలించని ప్రదేశం లేదనే చెప్పాలి. అయితే ఎన్ని చోట్ల గాలించినా ఛావీ కుమార్ ఆచూకీ లభించలేదు. దీంతో ఛావీ కుమార్ చనిపోయాడని భావించారు. అంతేకాకుండా,హిందూ సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు కూడా నిర్వహించారు. అతని భార్య మళ్లీ పెళ్లి చేసుకొని.. తన పిల్లాడిని తీసుకుని వెళ్లిపోయింది
అయితే భారత విదేశాంగ మంత్రిత్వశాఖ నుంచి పాకిస్తాన్ జైలులో ఉన్న ఓ వ్యక్తిని గుర్తించాలని బక్సర్ జిల్లాలోని ముఫాసిల్ పోలీస్ స్టేషన్ అధికారులకు బుధవారం ఓ లేఖ అందింది. దాంతో కొంతమంది పోలీసుల బృందం.. ఖిలాఫతాపుర్ దళితవాడకు చేరుకుని అక్కడ ఫొటో పట్టుకుని ఆరా తీశారు. దాంతో అది 12 ఏళ్ల క్రితం అదృశ్యమైన ఛావీ ముశాహర్గా అతడి కుటుంబ సభ్యులు గుర్తించారు. తమ కుమారుడు పాకిస్తాన్లోని ఓ జైలులో బందీగా బతికే ఉన్నాడనే వార్త తెలిసి ఆ తల్లిదండ్రుల ముఖాలు ఆనందంతో వెలిగిపోయాయి. ఛావీ బతికే ఉన్నాడన్న వార్త తెలుసుకుని, అతని కుటుంబ సభ్యులతో పాటు దళితవాడ అంతా సంతోషంలో మునిగిపోయింది. ఛావీ రాకకోసం వారంతా వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. తమ కుమారుడిని వెంటనే తీసుకురావాలని ఛావీ తల్లి ప్రభుత్వాన్ని కోరుతోంది.
ALSO READ Typhoon Rai : ఫిలిప్పీన్స్‌లో రాయ్ తుపాను బీభత్సం.. 12కి పెరిగిన మృతుల సంఖ్య