Farmers Protests : యథావిధిగా రైతు నిరసనలు..పలు డిమాండ్లతో మోదీకి లేఖ
నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయనున్నట్లు శుక్రవారం ప్రధాని మోదీ ప్రకటించిన నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై ఇవాళ(నవంబర్-21,2021) సింఘు సరిహద్దులో సంయుక్త కిసాన్ మోర్చా నేతలు

Rajewal
Farmers Protests నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయనున్నట్లు శుక్రవారం ప్రధాని మోదీ ప్రకటించిన నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై ఇవాళ(నవంబర్-21,2021) సింఘు సరిహద్దులో సంయుక్త కిసాన్ మోర్చా నేతలు సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. గతంలో నిర్ణయించిన కార్యక్రమాలు, ఆందోళనలు యథావిధిగా కొనసాగించాలని ఈ సమావేశంలో రైతు నేతలు నిర్ణయించారు.
ఈనెల 22న ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో కిసాన్ పంచాయత్, 26న అన్ని సరిహద్దుల్లో రైతుల సమావేశం, 29న పార్లమెంట్‌కు ట్రాక్టర్లలో ర్యాలీగా తరలివెళ్లటం యథావిధిగా కొనసాగుతుందని రైతు నేత బల్బీర్ సింగ్ రజెవాల్ స్పష్టం చేశారు. సాగు చట్టాల రద్దును స్వాగతిస్తున్నామని, అయితే చాలా విషయాలు పెండింగ్‌లో ఉన్నాయని బల్బీర్ సింగ్ అన్నారు.
పెండింగ్‌లో ఉన్న రైతుల డిమాండ్లపై మోదీకి బహిరంగ లేఖ రాయనున్నట్లు బల్బీర్ సింగ్ చెప్పారు. MSP కమిటీ, విద్యుత్తు బిల్లు 2020, రైతులపై కేసుల ఉపసంహరణ వంటి డిమాండ్లతో మోదీకి లేఖ రాయనున్నట్లు చెప్పారు. లఖింపుర్ ఖేరి హింస కేసులో భాగంగా కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేయనున్నట్లు తెలిపారు. భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు ఈనెల 27న మరోమారు సమావేశం అవుతామని ఆయన తెలిపారు.
కనీస మద్దతు ధర(MSP) చట్టం కోసం మహాపంచాయత్‌లో పాల్గొనేందుకు ఛలో లక్నో చేపడుతున్నట్లు భారతీయ కిసాన్ యూనియన్ జాతీయ ప్రతినిధి రాకేశ్ టికాయత్ తెలిపారు. వ్యవసాయ సంస్కరణలపై కేంద్రం చెప్పేవన్నీ ఉట్టి మాటలే.. వాటి వల్ల రైతుల పరిస్థితి ఏమి మారదు.. కనీస మద్దతు ధర కల్పిస్తూ చట్టం తీసుకొచ్చినప్పుడే అతిపెద్ద సంస్కరణ అని టికాయత్ అన్నారు.
ALSO READ Fire Accident : పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు