Cycle Girl Jyoti : సైకిల్ గర్ల్ జ్యోతి తండ్రి కన్నుమూత

గతేడాది దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్న సమయంలో తన తండ్రిని సైకిల్ పై కూర్చోపెట్టుకుని 1200 కిలో మీటర్లు ప్రయాణించి వార్తల్లో కెక్కిన బీహార్ కు చెందిన సైకిల్ గర్ల్ జ్యోతి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది.

Father Of Bihar Cycle Girl Jyoti Passed Away With Cardiac Arrest

Cycle Girl Jyoti : గతేడాది దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్న సమయంలో తన తండ్రిని సైకిల్ పై కూర్చోపెట్టుకుని 1200 కిలో మీటర్లు ప్రయాణించి వార్తల్లో కెక్కిన బీహార్ కు చెందిన సైకిల్ గర్ల్ జ్యోతి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆమె తండ్రి మోహ‌న్ పాశ్వాన్‌ సోమవారం గుండెపోటుతో మరణించారు.

మోహన్‌ సోమవారం ఉదయం ఒంట్లో నలతగా ఉందని చెప్పారు. అలా చెప్పిన కొద్దిసేపటికే ఆయన వాంతి చేసుకున్నారు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకు వెళ్లేలోపే ఆయన కన్ను మూశారు. మోహన్ మృతి పట్ల దర్భంగా జిల్లా అధికారులు విచారం వ్యక్తం చేశారు. జ్యోతి కుటుంబానికి అన్ని విధాలుగా సాయం అందిస్తామని చెప్పారు.

మోహన్ పాశ్వాన్ కు ముగ్గురు పిల్లలు.. కుటుంబ పోషణ కోసం గురుగ్రామ్‌లో ఆటో నడిపేవాడు. కుటుంబం మొత్తం బీహార్ లో ఉంటుండగా మోహన్ మాత్రం గురుగ్రామ్‌లో ఉండేవాడు. లాక్‌డౌన్ ప్రకటించటానికి కొన్నిరోజుల ముందు మోహన్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఆయన్ను చూడటానికి కుమార్తె జ్యోతి బీహార్ నుంచి గురుగ్రామ్ వచ్చింది.

ఆతర్వాత కొద్దిరోజులకే లాక్‌డౌన్ ప్రకటించటంతో తండ్రీ,కూతుళ్లు అక్కడే చిక్కుకు పోయారు. ప్రమాదం కారణంగా మోహన్ నడిచే పరిస్ధితి లేదు. ఉపాధిలేక పూట గడవడం కష్టంగా మారింది. ఇంటి అద్దెకూడా చెల్లించలేని పరిస్ధితి ఏర్పడింది. ఇల్లు ఖాళీచేయమని యజమాని ఒత్తిడి చేశాడు.

దాదాపు 45 రోజులపాటు కష్టాలు భరించిన జ్యోతి తమ వద్ద ఉన్న రూ.500లతో ఒక పాత సైకిల్ కొని దానిపై తండ్రిని ఎక్కించుకుని మే 10న గురుగ్రామ్ నుంచి దర్భంగాకు బయలుదేరింది. దాదాపు 1100 కిలోమీటర్లు… వారం రోజులపాటు అనేక కష్టాలను భరించి మే 16న స్వగ్రామం చేరుకుంది.

ఆసమయంలో ఆమె సైకిల్ ప్రయాణం గురించి అన్ని మీడియాల్లో కధనాలు వచ్చాయి. దేశమంతా ఆమె పేరు మారుమోగి పోయింది. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంకా కూడా జ్యోతి ధైర్య సాహసాలను మెచ్చుకున్నారు. ఈఏడాది జనవరి 25న ప్రధానమంత్రి సాహస బాలల పురస్కారం అందుకుంది.