Kedarnath Dham: కేదార్‌నాథ్‌ ఆలయం గర్భగుడిలో శివలింగంపై కరెన్సీ నోట్లు.. వీడియో వైరల్.. మహిళపై కేసు నమోదు

మహిళా భక్తురాలు గర్భగుడిలో శివలింగంపై కరెన్సీ నోట్లు విసురుతున్న సమయంలో ఆమెపక్కనే పలువురు భక్తులు ఉన్నారు. మంత్రాలు పఠిస్తూ మహిళను ప్రోత్సహించినట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోలో కనిపించింది.

Kedarnath Dham

Uttarakhand: హిందువులు పవిత్రంగా భావించే ఉత్తరాఖండ్‌ (Uttarakhand)లోని కేదార్‌నాథ్ ఆలయం (Kedarnath Temple) లో అపచారం చోటు చేసుకుంది. ఆలయం గర్భగుడిలోని శివలింగం (Shiv Lingam)పై మహిళా భక్తురాలు (female devotee) కరెన్సీ నోట్లు (Currency notes) వర్షం కురిపించింది. శివలింగంపై కరెన్సీ నోట్లు చల్లుతూ నృత్యం చేస్తూ కనిపించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన వివాదాస్పదం కావడంతో శ్రీ బద్రీనాథ్ – కేదార్‌నాథ్ ఆలయ కమిటీ (బీకెటిసి) స్పందించింది. కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించిన మహిళపై రుద్రప్రయాగ్ జిల్లా మెజిస్ట్రేట్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌కు ఫిర్యాదు చేశారు. ఆమెపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని ఆలయ కమిటీ కోరింది.

Uttarakhand : స్త్రీలు ఒంటిపై 80% కప్పుకుంటేనే ఉత్తరాఖండ్ ఆలయాల్లోకి అనుమతి ఇస్తారట

ఇదిలాఉంటే, మహిళా భక్తురాలు గర్భగుడిలో శివలింగంపై కరెన్సీ నోట్లు విసురుతున్న సమయంలో ఆమెపక్కనే పలువురు భక్తులు ఉన్నారు. మంత్రాలు పఠిస్తూ మహిళను ప్రోత్సహించినట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోలో కనిపించింది. గర్భగుడిలోని పండిట్ల సమక్షంలో ఈ ఘటన జరగడంతో బీకేటీసీ ప్రెసిడెంట్ అజేంద్ర అజయ్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. అధికారుల నుండి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియోలో ఒక మహిళా బాబా గర్భగుడిలోని శివలింగంపై కరెన్సీ నోట్లను ఊదుతూ కనిపించింది. ఆ సమయంలో బ్యాక్‌గ్రౌండ్‌లో ‘క్యాకభీ అంబర్ సే సూర్య బిచ్చరద్తా హై’ పాట వినిపిస్తోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు మహిళ భక్తురాలితో పాటు, ఆమెను అడ్డుకోని పండితులపైనా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

ఈ ఘటనపై ఉత్తరాఖండ్ సీఎం కార్యాలయం ట్వీట్ చేసింది. కేదార్‌నాథ్ గర్భగుడిలో ఒక మహిళ డబ్బుల వర్షం కురిపిస్తున్న వీడియో వైరల్ కావడంతో రుద్రప్రయాగ్ పోలీసులు భారతీయ శిక్షాస్మృతిలోని సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారని తెలిపారు. కేదార్‌నాథ్ ఆలయ కమిటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఇచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు ప్రారంభించారని పేర్కొన్నారు. ఈ ట్వీట్‌కు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌ వెల్లడిస్తున్న వివరాలతో కూడిన వీడియోను యాడ్ చేశారు.