కుంభమేళాలో పేలుడు కలకలం : సాధువుల పరుగులు
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుంభమేళాలో పేలుడు కలకలం చెలరేగింది. కుంభమేళా ప్రాంతంలో వంట గ్యాస్ సిలిండర్ పేలింది.

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుంభమేళాలో పేలుడు కలకలం చెలరేగింది. కుంభమేళా ప్రాంతంలో వంట గ్యాస్ సిలిండర్ పేలింది.
ప్రయాగ్‌రాజ్: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుంభమేళాలో పేలుడు కలకలం చెలరేగింది. కుంభమేళా ప్రాంతంలో వంట గ్యాస్ సిలిండర్ పేలింది. భారీ శబ్దంతో పేలడంతో భయాందోళన చెందిన సాధువులు, భక్తులు పరుగులు తీశారు. ఏం జరిగిందో తెలియక ఆందోళన చెందారు. సిలిండర్ పేలి మంటలు చెలరేగాయి. వెంటనే రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మూడు ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను ఆర్పివేశారు. ఎలాంటి ప్రాణనష్టం జరక్కపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. సిలిండర్ పేలుడికి కారణాలు తెలియాల్సి ఉంది.
కుంభమేళా సైట్‌లోని సెక్టార్ 16లో దిగంబర్ అఖాడాలో వంట గ్యాస్ సిలిండర్ పేలింది. మంటలు చెలరేడంతో పలు టెంట్లు కాలిపోయాయి. అగ్నిప్రమాదం జరిగిన చోట వేలాది టెంట్లు ఉన్నాయి. మంటలు విస్తరించి ఉంటే భారీగా ప్రాణనష్టం జరిగి ఉండేది. ఫైర్ సిబ్బంది వెంటనే అలర్ట్ కావడంతో భారీ ముప్పు తప్పింది.
2019, జనవరి 15వ తేదీ నుంచి అర్థ కుంభమేళా ప్రారంభం కానుంది. కోట్లాది మంది భక్తులు, నాగసాధవులు కుంభమేళాలకు తరలి రానున్నారు. మార్చి 4వ తేదీ వరకు 49 రోజులపాటు అర్ధ కుంభమేళా జరుగనుంది. యోగి అదిత్యానాథ్ ప్రభుత్వం దీని కోసం 4 వేల కోట్ల రూపాయలు కేటాయించింది. బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది తొలి కుంభమేళా. తొలి రోజు నాగ సాధువులు, పీఠాధిపతులు స్నానాలు ఆచరించనున్నారు. 192 దేశాల నుంచి 12 కోట్ల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేశారు. తొలి రోజు 30 లక్షల మంది స్నానాలు ఆచరిస్తారని ప్రభుత్వం అంచనా. 2వేల800 కోట్ల రూపాయలతో దాదాపు 250 కిలోమీటర్ల పొడవైన రోడ్లు, గంగా నది ఒడ్డును కలుపుతూ 22 వంతెనలు నిర్మించారు.