Twitter Blue Tick
Twitter: పలువురు రాజకీయ నాయకులు, సినీనటులు ట్విట్టర్ బ్లూటిక్ (Twitter Blue Tick) ను కోల్పోయారు. ఏపీ సీఎం జగన్ (YS Jagan Mohan Reddy), మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ (Rahul Gandhi), ప్రియాంకా గాంధీ, క్రికెటర్లు విరాట్ కోహ్లీ (Virat Kohli), రోహిత్ శర్మ, సినీనటులు పవన్ కల్యాణ్ (Pawan Kalyan), సమంత, అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్, అలియా భట్ సహా అనేక మంది ప్రముఖులు ట్విట్టర్ బ్లూటిక్ (Twitter Blue Tick) ను కోల్పోయిన వారి జాబితాలో ఉన్నారు.
నిన్నటి నుంచే వారి ఖాతాలకు బ్లూ టిక్ కనపడట్లేదు. ట్విట్టర్ ను ఎలాన్ మస్క్ కొనుగోలు చేయకముందు ఒకలా, కొనుగోలు చేసిన తర్వాత ఒకలా ఆ మైక్రోబ్లాగింగ్ సైట్లో నిబంధనలు ఉన్నాయి. ట్విట్టర్ ను ఎలాన్ మస్క్ కొనుగోలు చేయకముందు భారతీయ యూజర్లకు ఆ మైక్రోబ్లాగింగ్ సైట్ ఉచితంగా బ్లూ టిక్ అందించేది. ఎలాన్ మస్క్ వచ్చాక రూల్స్ మారిపోయాయి.
బ్లూటిక్ కావాలంటే డబ్బులు కట్టాల్సిందే. సబ్‌స్క్రైబ్ చేసుకోని వారి ఖాతాకు బ్లూటిక్ తొలగిస్తామని ఇటీవలే ట్విట్టర్ ప్రకటించింది. దీంతో నిన్న అన్నంత పనీ చేసింది. ప్రముఖుల ఖాతాల నుంచి బ్లూటిక్ ఎగిరిపోయింది. మిలియన్ల కొద్దీ ఫాలోవర్లు ఉన్న ప్రముఖులు ట్విట్టర్ చర్యతో షాక్ అవుతున్నారు. ఏప్రిల్ 1 నుంచి ట్విట్టర్ నిబంధనలు మార్చి, మళ్లీ సైన్ అప్ చేసుకోవాలని ప్రకటించినప్పటికీ చాలా మంది చేసుకోలేదు.
టాలీవుడ్ లో మహేశ్ బాబు, ఎన్టీఆర్ వంటి హీరోలు ముందుగానే జాగ్రత్త పడడంతో వారి బ్లూటిక్ పోలేదు. ఎలాన్ మస్క్ ట్విట్టర్ ను కొనుగోలు చేసినప్పటి నుంచి ఆ మైక్రోబ్లాగింగ్ సైట్ యూజర్లకు షాకులు ఇస్తూనే ఉన్నారు. పలు మీడియా సంస్థలకు కూడా బ్లూటిక్ తొలగించిన విషయం తెలిసిందే. కొన్ని సంస్థలు ట్విట్టర్ కు దూరంగా ఉంటామని కూడా ప్రకటించాయి.
Twitter Blue Tick