FSSAI: భారతీయుల్లో అధిక శాతం మందికి ఉదయాన్నే టీ తాగనిదే ఏ పనీ చేయాలనిపించదు. ప్రస్తుత కాలంలో అనేక రకాల టీలు మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి. హెర్బల్ టీ పేరుతో కూడా అమ్మకాలు జరుగుతున్నాయి. దీనిపై ఫుడ్ సేఫ్టీ, స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్ఎస్‌ఏఐ) ఓ కీలక ప్రకటన చేసింది.
మూలికలు, మొక్కల నుంచి తీసిన మిశ్రమాలతో చేసినదాన్ని టీ పేరుతో పిలవకూడదని ఆదేశించింది. హెర్బల్ టీకు వాడే మిశ్రమాలు తేయాకు శాస్త్రీయ నామం “కామెల్లియా సినెన్సిస్” నుంచి సేకరించినవి కాదని, ఈ కారణంగానే తాము ఈ సూచన చేస్తున్నామని చెప్పింది. హెర్బల్ టీ పేరుతో జరిపే అమ్మకాలు తప్పుదోవ పట్టించే ప్రచారమే అవుతుందని తెలిపింది.
Also Read: ప్రయాణికులకు శుభవార్త.. సంక్రాంతికి ఊరు వెళ్తున్నారా? ఈ మార్గాల్లో మరికొన్ని ప్రత్యేక రైళ్లు..
రూయిబోస్ టీ, హెర్బల్ టీ, ఫ్లవర్ టీ వంటివి ఏవీ కూడా తేయాకు మొక్క నుంచి సేకరించినవి కాదని క్లారిటీ ఇచ్చింది. కాంగ్రా టీతో పాటు గ్రీన్ టీ, ఇన్‌స్టంట్ టీ వంటి వాటిని టీగా వ్యవహరించవచ్చని వివరించింది. ఇవి తప్ప మిగతా తేయాకు సంబంధంలేని వాటిని టీగా చెప్పుకోవద్దని చెప్పింది.
నిబంధనలను పాటించేలా చేయడానికి వ్యాపార నిర్వాహకులకు కఠిన ఆదేశాలు జారీ చేసింది. తయారీదారులు, ప్యాకర్లు, మార్కెటర్లు, దిగుమతిదారులు, విక్రేతలు, ఈ-కామర్స్ వేదికలు నిబంధనలను కచ్చితంగా పాటించాలని చెప్పింది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆహార భద్రత కమిషనర్లు, ప్రాంతీయ డైరెక్టర్లు వీటిని కఠినంగా అమలు చేయాలని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ కోరింది.