ఫెర్నాండేజ్ జీవితం : నరనరాన దేశభక్తి.. ఎమర్జెన్సీలో పోస్టర్ బాయ్

జార్జి ఫెర్నాండేజ్… ఓ పోస్టర్ బాయ్ నుంచి రక్షణమంత్రివరకు ఎదిగిన ఆయన జీవితంలో ఎన్నడూ నమ్ముకున్న సిద్దాంతాల పట్ల రాజీపడలేదు. ప్రత్యర్థి పార్టీల చేత కూడా గౌరవించబడే ఫెర్నాండేజ్ ఓ సాధారణ స్థాయి నుంచి ప్రధాని పదవికి అర్హుడయ్యే స్థాయికి ఎదిగిన ఆయన జీవితం ఓ తెరిచిన పుస్తకం లాంటిది. 1930లో కర్ణాటకలోని మంగుళూరులో ఫెర్నాండేజ్ జన్మించారు. చిన్నతనం నుంచి ఉన్నత భావాలు కలిగిన ఫెర్నాండేజ్..1975లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా నిరసన గళం వినిపించారు. భావసారూప్యత నాయకులతో కలిసి ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఉద్యమాల్లో పాల్గొన్నారు.

ఎమర్జెన్సీ సమయంలో డైనమైట్ స్మగ్లింగ్ ఆరోపణలతో 1976 జూన్-10న కలకత్తాలో ఫెర్నాండేజ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుని బరోడా డైనమైట్ కేసుగా పిలుస్తారు. ఎమర్జెనీ ముగిసిన తర్వాత జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1977లో జరిగిన ఎన్నికల్లో బీహార్ రాష్ట్రంలోని ముజఫర్ పూర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్న ప్రతిసారీ ఆయన ప్రజల తరపున ఉద్యమాల్లో పాల్గొన్నారు. 1987 లో ఒకసారి ముంబైలో ఓ ర్యాలీలో పాల్గొన్న ఆయనను పోలీసులు ఈడ్చుకొంటూ వెళ్లిన ఘటన ఇప్పటికీ అందరికీ గుర్తు ఉంటుంది.

 1994లో సమతా పార్టీని స్థాపించిన ఫెర్నాండేజ్ ఆ తర్వాత బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. కొద్ది కాలంలోనే అటల్ బీహారీ వాజ్ పేయికి అత్యంత సన్నిహితుడిగా మారారు. ఎన్డీయే కన్వీర్ గా ఫెర్నాండేజ్ ఎన్నికయ్యారు. ఎల్ కే అద్వానీ, జశ్వంత్ సిన్హా లతో కూడా ఆయన మంచి సంబంధాలు కొనసాగించారు. రెండుసార్లు భారత్ కు రక్షణమంత్రిగా సేవలందించారు. మొదటిసారిగా  వాజ్ పేయి ప్రభుత్వంలో 1998మార్చి 19 నుంచి మార్చి-16, 2001 వరకు రక్షణమంత్రిగా పని చేశారు. మరోసారి అక్టోబర్ 21, 2001 నుంచి 2004 మే-22వరకు వాజ్ పేయి మంత్రివర్గంలో రక్షణమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. కార్గిల్ వార్, పోఖ్రాన్ అణుపరీక్షల సమయంలో రక్షణమంత్రి భారత్ సత్తాను ప్రపంచానికి తెలిసేలా చేశారు.

1999లో రక్షణమంత్రి ఉన్న సమయంలో ఆయన స్వదేశీ గళం వినిపించారు. అమెరికన్ మల్టీ నేషనల్ కంపెనీలకు వ్యతిరేకంగా నిరసన గళం విప్పారు. 1998లో ఓ ఇంటర్వ్యూలో ఫెర్నాండేజ్ మాట్లాడుతూ తాను ఎమ్ఎన్ సీ వ్యతిరేక వ్యక్తిని కాదని, స్వదేశీ అనుకూల వ్యక్తినని తెలిపారు. 88 ఏళ్ల వయస్సులో ఇవాళ(జనవరి 29, 2019)న ఢిల్లీలోని తన నివాసంలో ఆయన తుది శ్వాస విడిచారు. ఫెర్నాండేజ్ మృతి పట్ల రాష్ట్రపతి, ప్రధాని, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ  తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన దేశానికి అందించిన సేవలు వెలకట్టలేనివని అన్నారు.