Ghaziabad : శ్మశానంలో పెండ్లి చేసుకున్న జంట.. ఆ తరువాత వారికి ఊహించని షాక్.. విచారణ చేపట్టిన అధికారులు
Ghaziabad : ఉత్తరాఖండ్‌లో ఓ జంట తమ వివాహాన్ని శ్మశాన వాటికలో చేసుకోవడం స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది. అల్మోరా జిల్లాలోని మార్చులా ప్రాంతంలో రామ్‌గంగా, బడంగఢ్ నదుల సగమం వద్ద ఉన్న శ్మశాన వాటికలో ఈ జంట తమ పెండ్లి చేసుకుంది.
Ghaziabad
- ఉత్తరాఖండ్ ఘజియాబాద్‌లోని శ్మశానంలో ఓ జంట వివాహం
- స్థానిక ప్రజలు, నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు
- విచారణకు ఆదేశించిన అధికారులు
Ghaziabad : పెండ్లి అంటే శుభకార్యం. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల మధ్య అంగరంగ వైభవంగా వివాహ వేడుకను జరుపుకుంటారు. అయితే, ఉత్తరాఖండ్ ఘజియాబాద్‌లో ఓ జంట విభిన్నంగా శ్మశాన వాటికలో పెండ్లి చేసుకుంది. శ్మశాన వాటికలో పెండ్లి చేసుకుంటే అది చిరస్మరణీయంగా ఉంటుందని వారు భావించారు. దీంతో పెండ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ తరువాత వారు ఉత్తరాఖండ్‌లోని స్థానిక ప్రజల నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. అంతేకాదు.. అధికారిక విచారణను ఎదుర్కోవాల్సి వచ్చింది.
ఉత్తరాఖండ్‌లో ఓ జంట తమ వివాహాన్ని శ్మశాన వాటికలో చేసుకోవడం స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది. అల్మోరా జిల్లాలోని మార్చులా ప్రాంతంలో రామ్‌గంగా, బడంగఢ్ నదుల సగమం వద్ద ఉన్న శ్మశాన వాటికలో ఈ జంట తమ పెండ్లి చేసుకుంది. ఈ వివాహ కార్యక్రమానికి సుమారు 50మంది అతిథులు హాజరయ్యారు. ఈ పెండ్లికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆ జంట తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
శ్మశానాలు హిందూ సంప్రదాయంలో అంత్యక్రియలకు సంబంధించిన పవిత్ర స్థలాలుగా భావిస్తారు. అలాంటి ప్రదేశంలో సంబరాలు నిర్వహించడం మతపరమైన భావాలను దెబ్బతీసిందని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాహంపై స్థానికంగా, సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పలువురు స్థానికులు ఈ వివాహంపై అధికారులకు ఫిర్యాదులు చేశారు. అనుమతి లేకుండా శ్మశాన వాటికలో ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం చట్ట విరుద్ధం.. ఘటనపై విచారణను ప్రారంభించాం. సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని స్థానిక తహసీల్దార్ అబిద్ అలీ తెలిపారు.
అయితే, ఈ వివాహాన్ని నిర్వహించిన రిసార్ట్ మేనేజర్ రాకేశ్ శర్మ స్పందిస్తూ.. పెండ్లి జరిగే ప్రదేశం గురించి పూర్తి వివరాలు వధూవరులకు ముందుగానే తెలియజేశాం. ఆ ప్రదేశాన్ని వారే స్వయంగా ఎంచుకున్నారని తెలిపాడు. అయితే, ఈ సంఘటన ఉత్తరాఖండ్‌లో వేగంగా పెరుగుతున్న డెస్టినేషన్ వెడ్డింగ్స్ ట్రెండ్‌పై కొన్ని తీవ్రమైన ప్రశ్నలను కూడా లేవనెత్తుతోంది.
