సినిమాల్లో చూస్తుంటాం ఇటువంటి సీన్లు: కారులోనే బలవంతంగా యువతికి తాళి కట్టేశాడు

మాములుగా సినిమాల్లో చూస్తుంటాం.. విలన్ హీరోయిన్‌ని కిడ్నాప్ చేసి తాళి కట్టడం వంటి సీన్లు.. అవి సినిమాల్లోనే కాదు.. అటువంటి ఘటనే రియల్‌గా కూడా జరిగింది. కర్ణాటకలోని హసన్ జిల్లాలో ఘటన చోటుచేసుకుంది. బస్సు కోసం ఎదురు చూస్తున్న ఓ యువతిని అందరూ చూస్తుండగానే కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారు.
ఆ యువతిని కారులోకి లాక్కెళ్లగా, నడుస్తున్న కారులోనే వారిలో ఒక వ్యక్తి ఆమెకు బలవంతంగా తాళి కట్టారు. యువతికి వరుసకు బావ అయిన మను కుమార్ అనే 30ఏళ్ల వ్యక్తి ఇటువంటి చర్యకు పాల్పడ్డాడు. 21ఏళ్ల యువతి తనతో పెళ్లికి ఒప్పుకోలేదనే కారణంతో ఆమెను కిడ్నాప్ చేశాడు మను కుమార్.
అయితే తనను వదిలేయాలని ఆమె ఎంత బతిమిలాడినా వినకుండా బలవంతంగా తాళి కట్టాడు. అంతేకాదు దీనిని వీడియో కూడా తీశారు. ఈ ఘటనపై బాధితురాలి తల్లిదండ్రులు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. మనుకుమార్ కదిలే కారులో మంగళసూత్రాన్ని మెడలో బలవంతంగా కట్టడం.. దానికి సంబంధించిన వీడియోని వాళ్లు ఫేస్బుక్‌లో అప్‌లోడ్ చేయగా వీడియో వైరల్ అయ్యింది.
వీడియో వైరల్ అయిన తరువాత, నిందితులను గుర్తించిన పోలీసులు రామనగర జిల్లాలోని బెవురులో అరెస్ట్ చేశారు. కిడ్నాప్ గురించి తెలియక యువతి కుటుంబం ముందు పోలీసులకు తప్పిపోయినట్లుగా ఫిర్యాదు చేశారు. ఈ కేసులో మనుకుమార్ స్నేహితులు ప్రవీన్ కుమార్(23), వినయ్ టిఎన్ (25)ను అరెస్టు చేశారు. సందీప్ కెఎ(26), కారు డ్రైవర్ గాంధీ పరారీలో ఉన్నారు.