Prajwal Revanna: మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు బెంగళూరు కోర్టు శిక్ష ఖరారు చేసింది. జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది. జీవిత ఖైదుతో పాటు 11 లక్షల రూపాయలు జరిమానా కూడా విధించింది. అత్యాచారం, వేధింపుల కేసులో ప్రజ్వల్ రేవణ్ణకు జీవిత ఖైదు విధించింది న్యాయస్థానం.
అత్యాచారం కేసులో రేవణ్ణను దోషిగా నిర్ధారిస్తూ శుక్రవారం బెంగళూరు ప్రజాప్రతినిధుల న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. ప్రజ్వల్ రేవణ్ణ తన ఇంటి పనిమనిషిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో ప్రత్యేక కోర్టు దోషిగా నిర్ధారించింది. అత్యాచారం కేసు, అశ్లీల వీడియోల కేసుకు సంబంధించి అతనిపై మొత్తం నాలుగు కేసులు నమోదు కాగా.. మొదటి కేసులో కోర్టు ఈ తీర్పును ఇచ్చింది. న్యాయమూర్తి సంతోష్ గజానన్ శిక్షను ఖరారు చేశారు.
ప్రజ్వల్ రేవణ్ణ మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, మాజీ మంత్రి హెచ్‌డీ రేవణ్ణ తనయుడు. 2019 ఎన్నికల్లో హసన్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి జేడీఎస్ అభ్యర్థిగా విజయం సాధించాడు. 2023లో అఫిడవిట్ లో లోపాల కారణంగా కర్ణాటక హైకోర్టు అతడి ఎంపీ పదవిపై అనర్హత వేటు వేస్తూ తీర్పు ఇచ్చింది.
పని మనిషిపై రెండుసార్లు అఘాయిత్యం.. అశ్లీల వీడియోలు..
కరోనా సమయంలో హసన్‌లోని గన్నికాడ ఫామ్‌హౌజ్‌లో ప్రజ్వల్ తనపై రెండు సార్లు అత్యాచారం చేసినట్లు బాధితురాలు 2024 ఏప్రిల్‌లో పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనను ప్రజ్వల్ తన మొబైల్ లో వీడియో తీసినట్లు ఆమె ఆరోపించింది. అంతేకాదు.. ప్రజ్వల్ తల్లిదండ్రులు తనను కిడ్నాప్ చేసి బెదిరించారని ఆరోపించింది. ఈ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరంగా జరిగింది. ఈ కేసులో సెప్టెంబర్ 2024లో 1,632 పేజీల ఛార్జిషీట్ ను దాఖలు చేసింది.
పని మనిషిపై అత్యాచారం ఘటన మాత్రమే కాదు.. ప్రజ్వల్ పై అశ్లీల వీడియోల కేసులు నమోదయ్యాయి. 2024 లోక్ సభ ఎన్నికల తర్వాత ఈ వీడియోలు వెలుగులోకి రావడం కలకలం రేపింది. హసన్ లోని ఫామ్ హౌజ్ నుంచి 2వేలకు పైగా వీడియోలు ఉన్న పెన్ డ్రైవ్ ను పోలీసులు స్వాధీనం చేసుకోవటం తీవ్ర కలకలం రేపింది. ఈ వ్యవహారం బయటపడటానికి కొద్దిరోజుల ముందు ప్రజ్వల్ 27 ఏప్రిల్ 2024లో దేశం విడిచి వెళ్లిపోయాడు.
Also Read: ట్రంప్‌కు బిగ్ షాకిచ్చిన భారత్.. ఆ విషయంలో వెనక్కు తగ్గేది లేదంటూ క్లారిటీ..
గతేడాది మే 31న జర్మనీ నుంచి స్వదేహానికి తిరిగొచ్చిన రేవణ్ణను ఎయిర్ పోర్టులో పోలీసులు అరెస్ట్ చేశారు. 14 నెలలుగా జ్యుడీషియల్ కస్టడీలోనే ఉన్నాడు రేవణ్ణ. శుక్రవారం బెంగళూరులోని ప్రజాప్రతినిధుల న్యాయస్థానం రేవణ్ణను దోషిగా నిర్ధారిస్తూ తీర్పు వెలువరించింది. ఈ తీర్పు వినగానే ప్రజ్వల్ కోర్టు గదిలోనే కంటతడి పెట్టుకున్నాడు.