ట్రంప్‌కు బిగ్ షాకిచ్చిన భారత్.. ఆ విషయంలో వెనక్కు తగ్గేది లేదంటూ క్లారిటీ..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌‌నకు భారత ప్రభుత్వ వర్గాలు బిగ్ షాక్ ఇచ్చాయి. భారత చమురు సంస్థలు రష్యా సరఫరాదారుల నుంచి కొనుగోళ్లు కొనసాగిస్తున్నాయని ..

ట్రంప్‌కు బిగ్ షాకిచ్చిన భారత్.. ఆ విషయంలో వెనక్కు తగ్గేది లేదంటూ క్లారిటీ..

Donald Trump

Updated On : August 2, 2025 / 12:37 PM IST

Donald Trump – Russian Oil Imports: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌‌నకు భారత ప్రభుత్వ వర్గాలు బిగ్ షాక్ ఇచ్చాయి. అమెరికా సుంకాల ఒత్తిడి మధ్య భారతదేశంలోని అనేక ప్రభుత్వ చమురు శుద్ది కర్మాగారాలు రష్యా నుంచి చమురు కొనుగోళ్లు నిలిపివేశాయంటూ అంతర్జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇదే విషయాన్ని డొనాల్డ్ ట్రంప్ ప్రస్తావిస్తూ.. రష్యా నుంచి చమురును కొనుగోలు చేయడాన్ని భారత్ నిలిపివేసిందంటూ వ్యాఖ్యానించారు. ట్రంప్ వ్యాఖ్యలపై ప్రభుత్వ వర్గాల నుంచి ధీటైన స్పందన వచ్చింది. భారత చమురు సంస్థలు రష్యా సరఫరాదారుల నుంచి కొనుగోళ్లు కొనసాగిస్తున్నాయని స్పష్టం చేసింది.

భారత్ దిగుమతులపై సుంకాలు పెంపు నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడాలని ఆలోచిస్తున్నారా అని ట్రంప్‌ను ప్రశ్నించగా.. ‘‘భారత ప్రభుత్వం ఇకపై రష్యా ఆయిల్‌ను కొనుగోలు చేయదన్న విషయం నా వరకు వచ్చింది. అది నిజమా.. కాదా అనేది నాకు తెలియదు. అది నిజమైతే.. అది మంచి ముందడుగు. ఏం జరుగుతుందో చూద్దాం’’ అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు.

ట్రంప్ వ్యాఖ్యలపై ప్రభుత్వ వర్గాల నుంచి స్పందన వచ్చింది. భారత చమురు సంస్థలు రష్యా సరఫరాదారుల నుంచి కొనుగోళ్లు కొనసాగిస్తున్నాయని తెలిపాయి. అంతర్జాతీయ నిబంధనలకు పూర్తిగా కట్టుబడి.. అందుబాటు ధరల్లో లభ్యమయ్యే చమురు కొనుగోలును కొనసాగిస్తుంది. దేశ ఇంధన నిర్ణయాలు జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటాయి. అదే సమయంలో ఆ కొనుగోళ్లు అంతర్జాతీయ ఇంధన స్థిరత్వానికి, సమతుల్యతకు కూడా సానుకూలంగా దోహదం చేస్తున్నాయని స్పష్టం చేశాయి.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 25శాతం సుంకాలు విధించిన విషయం తెలిసిందే. రష్యా నుంచి భారీగా చమురు, ఆయుధాలు కొనుగోలు చేస్తున్నందుకే భారత దేశం దిగుమతులపై అదనంగా జరిమానా విధిస్తున్నట్టు ట్రంప్ చెప్పారు. ఉక్రెయిన్‌పై రష్యా ధౌర్జన్యం ఆపాలని ప్రపంచమంతా ఆకాంక్షిస్తోంది. ఇలాంటి సమయంలో రష్యాతో భారత్‌ భారీ వాణిజ్య సంబంధాలు నెరుపుతోంది అంటూ ట్రంప్ ఆక్షేపించిన విషయం తెలిసిందే.

మరోవైపు భారత్ చమురు కొనడం వల్లే ఉక్రెయిన్ పై రష్యా యుద్ధాన్ని కొనసాగించగలుగుతోందని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రుబియో పేర్కొన్నారు. అయితే, ఇప్పటికే భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ స్పందిస్తూ.. రష్యా నుంచి చమురు కొనుగోలుకు కట్టుబడి ఉన్నామని, దేశ ఇంధన ప్రయోజనాలను కాపాడుకోవడంలో భాగంగా అంతర్జాతీయ మార్కెట్లో అత్యుత్తమంగా ఉన్న వాటిని ఎంపిక చేసుకుంటూ ముందుకెళ్తున్నామని చెప్పారు. అయితే,  ట్రంప్ మరోసారి రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనుగోళ్లపై వ్యాఖ్యలు చేయడంతో ప్రభుత్వ వర్గాల నుంచి దీటైన స్పందన వచ్చింది. భారత చమురు సంస్థలు రష్యా సరఫరదారుల నుంచి కొనుగోళ్లు కొనసాగిస్తున్నాయని స్పష్టం చేశాయి.

ఇదిలాఉంటే.. చమురు దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. ఇక రష్యా నుంచి సముద్రమార్గంలో అత్యధికంగా చమురు దిగుమతి చేసుకునే దేశంగా భారత్ నిలిచింది.