Hindu Marriage: అలాంటి పెళ్లి చెల్లదు.. రిజిస్ట్రేషన్ ఒక్కటే సరిపోదు.. గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు
కేవలం మ్యారేజ్ సర్టిఫికేట్ ఉన్నంత మాత్రాన హిందూ వివాహం(Hindu Marriage) చట్టబద్ధం కాదని స్పష్టం చేసింది.
Gujarat High Court delivers a landmark verdict on Hindu marriage registration
- సప్తపది లేకపోతే పెళ్లి చెల్లదు.
- గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు.
- కేవలం రిజిస్ట్రేషన్ సరిపోదని స్పష్టీకరణ.
Hindu Marriage: హిందూ వివాహ వ్యవస్థపై గుజరాత్ హైకోర్టు ఒక మైలురాయి లాంటి సంచలన తీర్పును వెలువరించింది. కేవలం మ్యారేజ్ సర్టిఫికేట్ ఉన్నంత మాత్రాన హిందూ వివాహం చట్టబద్ధం కాదని స్పష్టం చేసింది. శాస్త్రోక్తంగా ‘సప్తపది’ (అగ్నిసాక్షిగా ఏడు అడుగులు నడవడం) లాంటి సాంప్రదాయక ఆచారాలు, క్రతువులు నిర్వహించకపోతే ఆ పెళ్లికి చట్టబద్ధత ఉండదని జస్టిస్ ఇలేష్ వోరా, జస్టిస్ ఆర్.టి. వచ్ఛానిలతో కూడిన డివిజన్ బెంచ్ తీర్పునిచ్చింది. వివాహం అనేది కేవలం పాటలు, డ్యాన్సులు, విందు వినోదాల వేడుక కాదని కోర్టు ఈ సందర్బంగా వ్యాఖ్యానించింది.
అసలు కేసు నేపథ్యం ఏమిటి?
యూకేలో నివసించే కౌశల్ సోనార్ అనే వ్యక్తి, అహ్మదాబాద్‌కు చెందిన ఒక మహిళ తనను భర్తగా పేర్కొంటూ మ్యారేజ్(Hindu Marriage) సర్టిఫికేట్ చూపించడాన్ని హైకోర్టులో సవాలు చేశాడు. తమ మధ్య ఎలాంటి హిందూ సాంప్రదాయ వివాహ క్రతువులు జరగలేదని, తన సంతకాన్ని మోసపూరితంగా తీసుకున్నారని ఆయన పేర్కొన్నాడు. సదరు మహిళ కూడా ఫ్యామిలీ కోర్టులో తమకు ఎలాంటి పెళ్లి ఆచారాలు జరగలేదని ఒప్పుకున్నప్పటికీ, ఫ్యామిలీ కోర్టు ఆ వివాహాన్ని రద్దు చేయడానికి నిరాకరించింది. దీనిని తప్పుపట్టిన హైకోర్టు.. ఫ్యామిలీ కోర్టు తీర్పును కొట్టేస్తూ, సదరు పెళ్లి చెల్లదని ప్రకటించింది.
హిందూ వివాహ చట్టం – సెక్షన్ 7 ప్రాధాన్యత:
హైకోర్టు తన తీర్పులో హిందూ వివాహ చట్టం-1955లోని సెక్షన్ 7ను ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఈ సెక్షన్ ప్రకారం, హిందూ వివాహం సంపూర్ణంగా చెల్లుబాటు కావాలంటే సాంప్రదాయక రీతిలో ఆచారాలు, ముఖ్యంగా సప్తపది జరగడం తప్పనిసరి. అగ్నిసాక్షిగా వధూవరులు ఇద్దరూ కలిసి వేసే ఏడో అడుగుతోనే వివాహ బంధం చట్టబద్ధంగా పూర్తవుతుంది. ఇవి లేనప్పుడు కేవలం కాగితాల మీద ఉండే రిజిస్ట్రేషన్‌కు విలువ ఉండదని కోర్టు స్పష్టం చేసింది.
వివాహం అంటే ఒక పవిత్ర సంస్కారం:
హిందూ సంస్కృతిలో వివాహం అనేది కేవలం ఒక వాణిజ్య ఒప్పందం కాదని, అదొక పవిత్రమైన “సంస్కారం” అని కోర్టు పేర్కొంది. భార్యను భర్తలో సగభాగంగా (అర్ధాంగిగా) గుర్తిస్తూనే, ఆమెకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు, సమాన భాగస్వామ్యం ఇచ్చే వ్యవస్థ ఇదని తెలిపింది. నేటి తరం యువతీ యువకులు వివాహ బంధంలోకి అడుగుపెట్టే ముందు ఈ వ్యవస్థ యొక్క పవిత్రతను, బాధ్యతను అర్థం చేసుకోవాలని హైకోర్టు హితవు పలికింది.
