హరియాణ నూతన ముఖ్యమంత్రిగా నాయబ్ సింగ్ సైనీ

హరియాణ నూతన ముఖ్యమంత్రిగా నాయబ్ సింగ్ సైనీ ఎంపికయ్యారు. ఖట్టర్ స్థానంలో సైనీని సీఎంగా బీజేపీ అధిష్టానం ఎంపిక చేసింది.

హరియాణ నూతన ముఖ్యమంత్రిగా నాయబ్ సింగ్ సైనీ

Haryana BJP president Nayab Singh Saini to be next CM of Haryana

Nayab Singh Saini: మనోహర్ లాల్ ఖట్టర్, ఆయన క్యాబినెట్ రాజీనామాతో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది. హరియాణ నూతన ముఖ్యమంత్రిగా నాయబ్ సింగ్ సైనీ ఎంపికయ్యారు. ఖట్టర్ స్థానంలో సైనీని సీఎంగా బీజేపీ అధిష్టానం ఎంపిక చేసింది. సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు.

ప్రస్తుతం ఆయన హరియాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. కురుక్షేత్ర లోక్‌సభ నియోజకవర్గానికి ఎంపీగానూ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 1996లో బీజేపీతో సైనీ రాజకీయ ప్రస్థానం మొదలైంది. కార్యకర్త స్థాయి నుంచి అంచెలంచెలుగా రాష్ట్ర అధ్యక్ష స్థాయికి ఎదిగారు. 2002లో అంబాలాలో బీజేపీ యూత్ వింగ్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా
బాధ్యతలు చేపట్టారు. 2005లో అంబాలాలో జిల్లా బీజేపీ అధ్యక్షునిగా నియమితులయ్యారు. పార్టీ పట్ల ఆయనకున్న అంకితభావం కారణంగా 2009లో కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి వరించింది.

2014లో నారాయణ్‌గఢ్ నియోజకవర్గం నుంచి శాసనసభ సభ్యునిగా ఎన్నిక కావడంతో ఆయన రాజకీయ జీవితం ఊపందుకుంది. 2016లో హరియాణ ప్రభుత్వంలో మంత్రిగా నియమితులైయ్యారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కురుక్షేత్ర నియోజకవర్గం నుంచి ఆయన ఘన విజయాన్ని అందుకున్నారు. సమీప ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ నేత నిర్మల్ సింగ్‌ను 3.83 లక్షల ఓట్ల భారీ తేడాతో ఓడించారు. గతేడాది అక్టోబర్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.

Also Read: లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి మల్లికార్జున్ ఖర్గే దూరం.. ఎందుకంటే?