18 ఏళ్లుగా డ్రగ్స్ తీసుకుంటున్నాడు.. ఓవర్ డోస్ వల్లే మృతి చెందాడు: కొడుకు మృతి కేసులో పంజాబ్ మాజీ డీజీపీ సంచలనం
ప్రస్తుతం ఈ కేసును ఏసీపీ స్థాయి అధికారి పర్యవేక్షణలోని సిట్ విచారిస్తోంది. మరిన్ని విషయాలు దర్యాప్తులో తేలనున్నాయి.

Punjab ex DGP Case: హరియాణాలో ఒక సంచలన కేసు నమోదైంది. పంజాబ్ మాజీ డీజీపీ మొహమ్మద్ ముస్తఫా, ఆయన భార్య, మాజీ మంత్రి రాజియా సుల్తానాపై వారి కుమారుడు అఖిల్ అక్తర్ (35) హత్య కేసులో ఎఫ్ఐఆర్ నమోదైంది.
ఈ కేసులో అఖిల్ భార్య, అక్కపైన కూడా కేసు నమోదు చేసినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ కేసు విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) నియమించారు.
అఖిల్ అక్తర్ డెత్ మిస్టరీ
పంచకుల డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీష్టి గుప్తా తెలిపిన వివరాల ప్రకారం.. అఖిల్ అక్టోబర్ 16న తన నివాసంలో మృతిచెందాడు. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు పోలీసులు విచారణ ప్రారంభించి, స్టేట్‌మెంట్లు రికార్డు చేశారు.
అక్టోబర్ 20న మలేర్కోట్లకు చెందిన ఓ రాజకీయ పార్టీ కార్యకర్త షమ్సుద్దిన్ చౌదరీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మాన్సాదేవి కాంప్లెక్స్ పోలీస్ స్టేషన్‌లో సెక్షన్స్ 103(1) (హత్య), 61 కింద కేసు నమోదైంది. ఫిర్యాదులో షమ్సుద్దిన్.. అఖిల్ రికార్డు చేసిన ఓ వీడియోను ప్రస్తావించారు.
అందులో అఖిల్.. “నా కుటుంబం నన్ను తప్పుడు కేసులో ఇరికించబోతోంది. నన్ను జైలుకి పంపాలని లేదంటే, చంపాలన్నదే వారి ప్లాన్. నా గురించి వారు తప్పుడు కథనాలు సృష్టిస్తున్నారు” అని అనడం గమనార్హం. అయితే, మరొక వీడియోలో అఖిల్ తన కామెంట్లను ఉపసంహరించుకుంటూ “నేను ముందు పోస్ట్ చేసిన వీడియోలో చాలా విషయాలు చెప్పాను. అవన్నీ నా మానసిక స్థితి వల్ల చెప్పినవే. నాది చాలా మంచి కుటుంబం.. అదృష్టమే” అని పేర్కొన్నాడు.
మా కొడుకు డ్రగ్స్ బానిస: ముస్తఫా
తనపై వస్తున్న ఆరోపణలను మొహమ్మద్ ముస్తఫా తీవ్రంగా ఖండించారు. తన కుమారుడు అఖిల్ గత 18 ఏళ్లుగా మాదకద్రవ్యాలకు బానిసై, తీవ్ర మానసిక రుగ్మతలతో బాధపడ్డాడని తెలిపారు.
“ప్రాథమిక పోలీస్ దర్యాప్తు ప్రకారం, అఖిల్ అధిక మోతాదులో బుప్రినార్ఫిన్ ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత మృతి చెందాడు. 2007 నుంచి PGIMER చండీగఢ్ వంటి చోట్ల చికిత్స తీసుకున్నా, మారలేదు. ఒకసారి మా ఇంటికే నిప్పుపెట్టాడు” అని ముస్తఫా జాతీయ మీడియాతో అన్నారు.
నాలుగుసార్లు “ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ ఫర్ గెలంట్రీ” అందుకున్న ముస్తఫా, 2018లో పంజాబ్ పోలీస్ యాంటీ డ్రగ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) చీఫ్‌గా పని చేయడం గమనార్హం. ఆయన ఇప్పుడు తన కొడుకు డ్రగ్స్ వాడాడంటూ చెబుతుండడం ఆశ్చర్యంగా ఉంది. ఆయన భార్య సుల్తానా మలేర్కోట్ల నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.
కేసులో రాజకీయ కోణం?
ఫిర్యాదు చేసిన షమ్సుద్దిన్ చౌదరీ.. మలేర్కోట్లలోని ఆప్ పార్టీ ఎమ్మెల్యే మొహమ్మద్ జమీల్ ఉర్ రెహ్మాన్‌కు గతంలో వ్యక్తిగత సహాయకుడిగా పనిచేశాడని ముస్తఫా తెలిపారు. దీనిపై ఎమ్మెల్యే రెహ్మాన్ మాట్లాడుతూ.. “2022 ఎన్నికల ప్రచారంలో చౌదరీ మా పార్టీలో పనిచేశాడు.. కానీ, ఒక సంవత్సరం క్రితమే ఆయనతో సంబంధం తెంచుకున్నాం” అన్నారు.
చౌదరీ మాత్రం.. “అఖిల్ మరణం పట్ల నాకు అనుమానం కలగడంతోనే ఫిర్యాదు చేశాను. నేను ఏ వ్యక్తిపై ప్రత్యక్ష ఆరోపణలు చేయలేదు” అని స్పష్టం చేశారు.
ముస్తఫా కుటుంబం స్పందన
సుల్తానా, ఆమె కుమార్తె నిషాత్ అక్తర్ (కాంగ్రెస్ నాయకురాలు) తమ అధికారిక ఫేస్‌బుక్ పేజీల ద్వారా స్పందించారు. రాజకీయ స్వార్థ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తమ కుటుంబంపై కేసు నమోదు చేయడం విచారకరమని అన్నారు. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినంత మాత్రాన నేరం నిరూపితమైనట్లు కాదని తెలిపారు. విచారణ ప్రారంభమైందని, నిజం బయట పడుతుందని చెప్పారు.
అఖిల్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉండేది?
ముస్తఫా తెలిపిన వివరాల ప్రకారం.. అఖిల్ డెహ్రాడూన్‌లోని వెల్హామ్ బాయ్స్ స్కూల్లో చదువుతున్నప్పటి నుంచే మత్తు పదార్థాలకు బానిసయ్యాడు. “2007 నుంచి మేము పదేపదే అతనికి డీ-అడిక్షన్ ట్రీట్‌మెంట్ చేయించాం. అతను మానసిక రుగ్మతతో బాధపడ్డాడు. భార్య, తల్లిని డబ్బు కోసం వేధించేవాడు. కొన్ని నెలల క్రితం ఐస్ డ్రగ్ (ICE) కూడా వాడేశాడు. మా గన్‌మెన్, పోలీసులపై దాడి చేశాడు. మా ఇంటికే నిప్పుపెట్టాడు ” అని ముస్తఫా ఆవేదన వ్యక్తం చేశారు.
కీలం కానున్న ఫోరెన్సిక్ నివేదిక
అఖిల్‌కి ఉత్తరప్రదేశ్‌లోని సహారన్‌పూర్ జిల్లా హర్దా ఖేరి గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. పోలీసులు ఆయన విసెరా శాంపిల్స్‌ను ఫోరెన్సిక్ పరిశీలనకు పంపారు. ఈ రిపోర్టు రావడానికి 2-3 నెలలు పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ కేసును ఏసీపీ స్థాయి అధికారి పర్యవేక్షణలోని సిట్ విచారిస్తోంది. మరిన్ని విషయాలు దర్యాప్తులో తేలనున్నాయి.