బాబోయ్, భారత్‌లో ఒక్కరోజే 32వేలకు పైగా కరోనా కేసులు

  • Publish Date - July 16, 2020 / 10:05 AM IST

భారత్‌లో కరోనా ఉగ్రరూపం దాల్చింది. ఊహించని రీతిలో కరోనా మహమ్మారి వీరవిహారం చేస్తోంది. తాజాగా రికార్డు స్థాయిలో కొత్త కేసులు, మరణాలు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 32వేల 695 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 9లక్షల 68వేల 876కి చేరింది. మన దేశంలో కరోనా వైరస్ వెలుగులోకి వచ్చాక ఈ స్థాయిలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి. ఇక గడిచిన 24 గంటల్లో మరో 606 మంది కరోనాతో చనిపోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 24వేల 915కు చేరింది.

కోటి 27లక్షలు దాటిన కరోనా టెస్టులు:
దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 3లక్షల 31వేల 146. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 6లక్షల 12వేల 815. మరోవైపు దేశంలో కరోనా టెస్టులను భారీగా పెంచారు. నిన్న(జూలై 15,2020) ఒక్కరోజే రికార్డు స్థాయిలో 3లక్షల 26వేల 826 శాంపిల్స్ టెస్టు చేశారు. ఇప్పటివరకు దేశంలో మొత్తం టెస్టుల సంఖ్య కోటి 27లక్షల 39వేల 490కి చేరింది. ప్రస్తుతం దేశంలో కరోనా రోగుల రికవరీ రేటు 63శాతంగా ఉంది.

15 రోజుల్లోనే 3లక్షల 80వేల కేసులు, 7వేల 515 మరణాలు:
దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్యతోపాటు మరణాల సంఖ్య కూడా పెరగడం కలవరపెడుతోంది. గత జూన్‌ నెలలో దేశవ్యాప్తంగా దాదాపు 4లక్షల కేసులు బయటపడగా, జులైలో 15 రోజుల్లోనే 3లక్షల 83వేల కేసులు బయటపడ్డాయి. అంతేకాకుండా ఈ 15 రోజుల్లోనే 7వేల 515 మంది కరోనాతో చనిపోయారు.

6 రాష్ట్రాల్లో వెయ్యి దాటిన కరోనా మరణాలు:
దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో కరోనా మరణాల తీవ్రత ఎక్కువగా ఉంది. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో వెయ్యికిపైగా కొవిడ్‌ మరణాలు రికార్డయ్యాయి. * అత్యధికంగా మహారాష్ట్రలో 2లక్షల 75వేల 640 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 10వేల 928 మంది ప్రాణాలు కోల్పోయారు.
* ఢిల్లీలో 3వేల 487 మంది మరణాలు
* తమిళనాడులో 2వేల 167 మరణాలు
* గుజరాత్‌లో 2వేల 79 మరణాలు
* ఉత్తర్‌ప్రదేశ్‌ లో 1012 మరణాలు
* పశ్చిమ బెంగాల్‌లో 1000 మంది మరణం

కొన్ని రోజులుగా దేశంలో నిత్యం 20వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈసారి ఏకంగా 30వేలకు పైగా కేసులు బయటపడటం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. అంతే స్థాయిలో మరణాల సంఖ్యా పెరుగుతుండటం కలవరపెడుతోంది. ఇప్పుడు దేశ వ్యాప్తంగా కుండపోత వానలు పడుతున్నాయి. ఇలాంటి వాతావరణంతో కరోనా కేసులు, మరణాలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. దీంతో ప్రజల్లో భయాందోళనలు మరింత పెరిగాయి.