Dhiraj Sahu: ఇప్పటికే రూ.353.5 కోట్ల డబ్బుల కట్టలు స్వాధీనం.. దాచిన బంగారాన్ని ఇప్పుడు ఎలా గుర్తిస్తున్నారో తెలుసా?
భూమిలోపల దాచి పెట్టే బంగారాన్ని కూడా గుర్తించే హై టెక్ గాడ్జెట్లు ఉన్నాయి. జియో నిఘా వ్యవస్థను వాడి..

Dhiraj Sahu
Odisha Cash Haul: కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహూతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు చెందిన సంస్థల్లో పట్టుబడ్డ కోట్లాది రూపాయలను లెక్కించడానికి ఐదు రోజులు పట్టింది. ఆదాయ పన్ను శాఖ చేసిన దాడుల్లో మొత్తం రూ.353.5 కోట్లు లభ్యమైన విషయం తెలిసిందే.
దేశంలో ఇంతకు ముందు వరకు ఏ దర్యాప్తు సంస్థకూ ఇంత పెద్ద మొత్తంలో డబ్బు పట్టుబడలేదు. ధీరజ్ సాహూ సంస్థల్లో కట్టలు కట్టలుగా డబ్బు స్వాధీనం చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆదాయపన్ను శాఖ ఆయా సంస్థల్లో బంగారు ఆభరణాలను గుర్తించడంపై దృష్టి పెట్టింది.
భూమిలో దాచే బంగారాన్ని ఎలా గుర్తిస్తారు?
డబ్బును గుర్తించారు సరే.. మరి ఎవరికీ కనపడకుండా దాచిపట్టే బంగారాన్ని అధికారులు ఎలా గుర్తిస్తారన్న సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. ధీరజ్ కుమార్ సాహూ సంస్థల్లో బంగారు ఆభరణాలను గుర్తించడం కోసం ఆదాయపన్ను శాఖ హై టెక్ గాడ్జెట్లను వాడుతోంది. భూమిలోపల దాచి పెట్టే బంగారాన్ని కూడా గుర్తించే హై టెక్ గాడ్జెట్లు ఉన్నాయి.
జియో నిఘా వ్యవస్థను వాడి అధికారులు బంగారాన్ని, ఇతర విలువైన వస్తువులను సులువుగా గుర్తిస్తారు. ఝార్ఖండ్‌లోని రాంఛీ, లోహర్దగాలోని ధీరజ్ సాహూకు చెందిన రెండు ఇళ్లలో దీని ద్వారానే అధికారులు బంగారాన్ని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు.
దీనిపై ఓ అధికారి మీడియాతో మాట్లాడుతూ ‘ఇప్పటికే పెద్ద మొత్తంలో డబ్బు గుర్తించారు. ఇప్పుడు సరికొత్త సాంకేతికతను వాడుతూ మరింత బంగారాన్ని గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నారు’ అని చెప్పారు.