తెలివిగల పిల్లలు పుట్టాలంటే ఏం చేయాలో చెప్పారు ఓ మహిళా డీఐజీ. అది కూడా స్కూల్ విద్యార్థినులకు ఈ విషయంపై పాఠాలు చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇటీవల వైరల్ కావడంతో ఆ మహిళా డీఐజీపై విమర్శలు వస్తున్నాయి.
మధ్యప్రదేశ్‌లోని షాహ్‌దోల్ డీఐజీ సవితా సోహానే ఇటీవల అమ్మాయిల భద్రత కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అవగాహన కార్యక్రమంలో భాగంగా ఓ ప్రైవేట్ స్కూల్‌లో ఉపన్యాసం ఇచ్చారు. ఆ విద్యార్థినులు అందరూ 10 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న వారే.
ఈ కార్యక్రమంలో విద్యార్థినులతో సవితా సోహానే మాట్లాడుతూ.. “మీకు కొత్త తరం వారు పుడతారు. మీరు దీని కోసం ఎలా సిద్ధపడతారు? అందుకోసం మీరు ప్రణాళిక వేసుకోవాల్సి ఉంటుంది. ఈ మొదటి పాయింట్‌ను నోట్ చేసుకోండి.. పౌర్ణమి రోజు గర్భం దాల్చొద్దు. తెలివైన పిల్లలు పుట్టడానికి సూర్యుడి ముందు తలవంచి నమస్కరిస్తూ నీళ్లు వదలండి” అని అన్నారు.
సవితా సోహానే వీడియో వైరల్ అవుతుండడంతో ఆమెను జాతీయ మీడియా వివరణ అడిగింది. తనకు గ్రంథాలు చదవడం, హిందూ ఆధ్యాత్మిక నాయకుల ఉపన్యాసాలు వినడం, ఉపన్యాసాలు ఇవ్వడం అంటే ఇష్టమని చెప్పారు.
ఆడపిల్ల పట్ల గౌరవాన్ని పెంపొందించడం కోసం నిర్వహించిన “మై హూన్ అభిమన్యు” కార్యక్రమంలో తాను మాట్లాడినట్లు తెలిపారు. ప్రతి నెల నేను ఒక పాఠశాలలో ఉపన్యాసం ఇస్తానని అన్నారు. 31 సంవత్సరాల క్రితం తాను పోలీసు సర్వీసులోకి రావడానికి సాగర్ జిల్లాలోని ఒక ప్రభుత్వ ఇంటర్ కాలేజ్ పాఠశాలలో నాలుగు సంవత్సరాలు లెక్చరర్‌గా పనిచేశానని తెలిపారు.