Actor Vijay TVK : రాజకీయాల్లో నేను చిన్నపిల్లాడినే.. కానీ భయపడను.. వెనక్కి తగ్గేదేలేదు.. ఫస్ట్ స్పీచ్‌తోనే అదరగొట్టిన విజయ్

Actor Vijay : 2026 అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే అన్ని స్థానాల్లో పోటీ చేయనున్నట్టు విజయ్ ప్రకటించారు. ద్రావిడ రాజకీయాల ముసుగులో ప్రజలను మోసం చేస్తున్న కుటుంబ పార్టీ అంటూ డీఎంకేను విజయ్ విమర్శించారు.

I am a baby in politics but not fearful of it

Actor Vijay TVK : తమిళ రాజకీయాల్లోకి మరో కొత్త పార్టీ ఆవిర్భించింది. సినీహీరోగా మొదలై రాష్ట్ర రాజకీయాల్లోకి అడుగుపెట్టారు తమిళ హీరో విజయ్.. విల్లుపురంలో నిర్వహించిన తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ తొలి మహానాడులో విజయ్ మొదటి ప్రసంగంతోనే అదరగొట్టారు.

ఈ సమావేశంలో పార్టీ కార్యకర్తలు, ప్రజలను ఉద్దేశించి సుదీర్ఘంగా మాట్లాడుతూ.. ఒక కుటుంబం రాష్ట్రాన్ని లూటీ చేస్తోందని ఆరోపించారు. తాను రాజకీయాల్లో ఒక చిన్నపిల్లాడిని.. కానీ, భయపడను.. వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. రాజకీయాల్లో తాను ఎందుకు రావాల్సి వచ్చిందో ప్రజలకు వివరించిన విజయ్.. తన పార్టీ సిద్ధాంతాల గురించి కూడా తెలియజేశారు.

అన్ని వదిలేసి.. మీ విజయ్‌గా నిలబడ్డా.. :
అన్ని తెలిసే రాజకీయాల్లోకి అడుగుపెట్టానన్న విజయ్.. టీవీకే పార్టీపై ప్రత్యర్థుల విమర్శలకు తనదైన శైలిలో విజయ్ బదులిచ్చారు. రాజకీయాల్లో గెలుపు, ఓటములు గురించి ముందే తెలుసునని, హీరోగా కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే ప్రజల కోసం వదిలేశానన్నారు. మీ విజయ్‌గా మీ ముందు నిలబడ్డానంటూ రాష్ట్ర ప్రజలు, అభిమానులను ఉద్దేశించి ప్రసంగించారు.

తనను రాజకీయాల్లో చిన్నపిల్లాడిని కొందరు అంటున్నారన్న ఆయన తాను చిన్నపిల్లాడినే కానీ.. రాజకీయం అనే పాముతో ఆడుకునే పిల్లాడిని.. భయపడేది లేదని విజయ్ పేర్కొన్నారు. తనను సినిమా ఆర్టిస్ట్‌గానే కొందరూ చూస్తున్నారని.. చరిత్రలో తమిళనాట ఒక ఎంజీఆర్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ వరకు రాజకీయాల్లో ఎలా ఎదిగారు అనే విషయాన్ని ఈ సందర్భంగా విజయ్ గుర్తు చేశారు.

ఆ రెండు వేరుచేయబోం.. రెండు కళ్లులాంటివి :
పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో అధికార డీఎంకే పార్టీపై కూడా విజయ్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ద్రావిడ రాజకీయాల ముసుగులో ప్రజలను మోసం చేస్తున్న కుటుంబ పార్టీ అంటూ డీఎంకేను విజయ్ విమర్శించారు. సిద్ధాంత పరంగా, ద్రావిడ జాతీయవాదం, తమిళ జాతీయవాదాన్ని వేరు చేయబోమని స్పష్టం చేశారు. ఆ రెండు ఈ నేలకి రెండు కళ్ళు లాంటివిగా పేర్కొన్నారు. లౌకిక సామాజిక న్యాయ సిద్ధాంతాలే తమ టీవీకే పార్టీ సిద్ధాంతమని స్పష్టం చేశారు. రాజకీయాల్లో అపజయాలు, విజయవంతమైన కథలన్నీ చదివిన తర్వాతే తాను సినీ కెరీర్ వదిలేసి మీ విజయ్‌గా ఇక్కడ ఉన్నానని పేర్కొన్నారు.

2026లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం :
2026 అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్లు విజయ్ ప్రకటించారు. తమిళగ వెట్రి కజగం (TVK) ప్రారంభ సదస్సు సందర్భంగా డీఎంకే వ్యవస్థాపకుడు, మాజీ సీఎం సీఎన్ అన్నాదురై మొదట ప్రతిపాదించిన “ఒండ్రే కులం, ఒరువనే తేవన్” సూత్రాన్ని ఉటంకిస్తూ విజయ్ పార్టీ మార్గదర్శక సిద్ధాంతాన్ని నొక్కి చెప్పారు.

అంతకముందు.. 100 అడుగుల ఎత్తైన జెండా స్తంభంపై పార్టీ జెండాను ఎగురవేసి కీలక ఘట్టాన్ని గుర్తు చేసుకున్నారు. వేదికపై నిలబడి.. విజయ్ జెండాను ఎగురవేశారు. పార్టీ లక్ష్యాలు, విలువల పట్ల తన అంకితభావానికి ప్రతీకగా నిలిచారు. తమిళనాడు స్వాతంత్ర్య సమరయోధుల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

మరోవైపు.. తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ విజయ్ భవిష్యత్తుకు శుభాకాంక్షలు తెలిపారు. నటుడు విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించి ఈ ఏడాది ఫిబ్రవరిలో తమిళగ వెట్రి కజం అనే పార్టీ పేరును ప్రకటించారు. 2026లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది.

Read Also : Asteroid Alert : నాసా హెచ్చరిక.. భూమికి అతిదగ్గరగా దూసుకొస్తున్న భారీ గ్రహశకలం.. తాజ్ మహల్‌కు 5 రెట్లు ఉంటుందట..!