తెలంగాణకి లింకేంటీ : ఇసుక మాఫియాలో లేడీ ఐఏఎస్ పేరు

  • Published By: madhu ,Published On : January 5, 2019 / 08:41 AM IST
తెలంగాణకి లింకేంటీ : ఇసుక మాఫియాలో లేడీ ఐఏఎస్ పేరు

ఢిల్లీ : ఇసుక అక్రమ తవ్వకాల కేసులో యూపీ, ఢిల్లీలో సిబిఐ సోదాలు  నిర్వహిస్తోంది. ఐఏఎస్ అధికారిణి చంద్రకళ ఇంటిపై సీబీఐ దాడులు నిర్వహిస్తోంది. మైనింగ్ స్కాం, ఇసుకమాఫియాతో చేతులు కలిపిందని, అవకతవకలకు పాల్పడిందని సీబీఐ కేసు నమోదు చేసింది. 2019 జనవరి 5వ తేదీ శుక్రవారం ఏకకాలంలో 12 చోట్ల సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. అలహాబాద్ హైకోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేసినట్లు సీబీఐ అధికారులు తెలిపారు. 
కరీంనగర్ వాసి..ఈ ఐఏఎస్ అధికారిణి
చంద్రకళ స్వస్థలం కరీంనగర్ జిల్లా. నిజాయితీ గల ఐఏఎస్ అధికారిగా వార్తలకెక్కిన చంద్రకళను సోదాల పేరుతో వేధించడాన్ని అధికారులు ఖండించారు. అవినీతికి పాల్పడే నాయకులే ఆమెను టార్గెట్ చేసి కేసులు వేశారని ఆరోపించారు. యూపీ క్యాడర్ అధికారి అయిన ఈ తెలంగాణ తేజం.. 2014లో నాసిరకం రోడ్లు వేసిన అధికారులను, కాంట్రాక్టర్లను పబ్లిగ్గా నిలదీసి సంచలనం సృష్టించారు. ఓయూ నుంచి ఎంఏ పట్టా పుచ్చుకున్న చంద్రకళ 2008లో ఐఏఎస్ టాపర్‌గా నిలిచారు. 
అవినీతి వ్యతిరేక అధికారిణిగా గుర్తింపు…
బులంద్‌షహర్, బిజ్నోర్, మీరట్ జిల్లాల కలెక్టర్‌గా ఆమె స్వచ్ఛభారత్ కోసం ఎంతగానో కృషి చేసి పేరు తెచ్చుకున్నారు. అవినీతిపై నిప్పులు చెరిగే అధికారిగా సామాజిక మాధ్యమాల్లో చంద్రకళ పేరు మారుమోగింది. బిజ్నోర్‌ను బహిరంగ మలవిసర్జనరహిత జిల్లాగా మార్చేందుకు ఆమె చేపట్టిన చర్యలు కేంద్ర సర్కారు ప్రశంసలు పొందాయి. ఇప్పుడామె నిజాయితీకి, కృషికి గుర్తింపుగా ప్రధాని నరేంద్రమోదీ ఆమెను తన డ్రీమ్‌ టీంలో చేర్చుకున్నారు. స్వచ్ఛభారత్ మిషన్ డైరెక్టర్‌గా, కేంద్ర తాగునీరు, పారిశుధ్ధ్య మంత్రిత్వశాఖ ఉపకార్యదర్శిగా నియమించారు. దీంతో ప్రస్తుతం మీరట్ కలెక్టర్‌గా ఉన్న చంద్రకళ ఇటీవలే ఢిల్లీకి మారింది. ఈమె ఎల్లప్పుడూ క్రమశిక్షణకు పెద్దపీట వేస్తారు. 

చంద్రకళకు ప్రతిష్టాత్మక పదవి…
గత ఫిబ్రవరి 1న ఓ కార్యక్రమానికి వెళ్లినప్పుడు 18 సంవత్సరాల యువకుడు సెల్ఫీలతో చిరాకు తెప్పిస్తే అతడిని 14 రోజులు పోలీసు కస్టడీకి పంపారు. అనుమతి లేకుండా ఇతరులతో సెల్ఫీలు దిగడం భావ్యం కాదని తర్వాత ఓ ఇంటర్వ్యూలో కుండబద్దలు కొట్టారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో పుట్టి ఫర్టిలైజర్‌సిటీలో చదివి ఐఏఎస్‌కు ఎంపికై ఉత్తరప్రదేశ్ క్యాడర్‌లో కొనసాగుతున్న చంద్రకళకు ప్రతిష్ఠాత్మకమైన పదవి లభించడం పట్ల కోల్‌బెల్ట్‌లో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. స్వఛ్చభారత్ మిషన్‌కు ఆమెను డైరెక్టర్‌గా ఎంపిక చేయడం తెలంగాణకు గర్వకారణమని అంటున్నారు. ఉత్తర్‌ప్రదేశ్ ఐఏఎస్ అధికారిగా అనేక సంచలనాలకు కేంద్ర బిందువైన చంద్రకళ.. కాంట్రాక్టర్ల అవినీతిని నిలదీసిన వైనం సోషల్ మీడియాలో అప్పట్లో వైరల్‌గా మారి దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఇదేనా మీ పనితీరు? దీనికి మీరు జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. ఇది ప్రజల సొమ్ము. ముడుపులకూ ఓ హద్దుంటుంది అని ఆమె గర్జించిన తీరు అబ్బరపరిచింది. ఇటు కాంట్రాక్టర్లు, అటు అధికారులపై ఏకకాలంలో యుద్ధాన్ని ప్రకటించడం ఆమె సాహసానికి అద్దం పట్టింది. మీ మీద ఎఫ్‌ఐఆర్ బుక్ చేయాలి. కొంత సిగ్గు తెచ్చుకోండి. మీలో నీతి చచ్చిపోయింది. రెండురోజుల్లో కొత్త టైల్స్‌తో రోడ్డు నిర్మాణం మొదలు కావాలి. లేకుంటే మిమ్మల్ని బ్లాక్‌లిస్టులో పెట్టాల్సి ఉంటుంది అంటూ పరుగులు పెట్టించారు. బులంద్‌షహర్ జిల్లా కలెక్టర్‌గా ఆమె చూపిన ధైర్యసాహాసాలు అవినీతిపరుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన అంశాలను పరిగణలోకి తీసుకోని ఆమెను స్వఛ్చ భారత్‌మిషన్‌కు డైరెక్టర్‌గా నియమించినట్టు తెలుస్తున్నది.