24 మార్కులతో పాస్ అయ్యాను…IAS అధికారి ట్వీట్ వైరల్

  • Published By: Chandu 10tv ,Published On : July 15, 2020 / 04:45 PM IST
24 మార్కులతో పాస్  అయ్యాను…IAS అధికారి ట్వీట్ వైరల్

Updated On : July 15, 2020 / 5:17 PM IST

సాధారణంగా ఈ సమాజంలో వందలో 99 శాతం మంది ప్రజలు మార్కుల ఆధారంగానే పిల్లల తెలివితేటలను, వారి జీవితాన్ని అంచనా వేస్తారు. అంతేకాకుండా బాగా చదివే పిల్లలతో పోల్చి తిడుతూ ఉంటారు. మార్కులే జీవితం కాదు, మార్కులు మన వందేళ్ల జీవితాన్ని నిర్ణయించలేవంటూ ఐఏఎస్ అధికారి చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మనలో చాలా మందికి ఐఏఎస్ కావాలంటే తెలివితేటలు బాగా ఉండాలి అనే భావనలో ఉంటారు. కానీ ఓ ఐఏఎస్ అధికారి చేసిన ట్వీట్ చూస్తే మన ఆలోచనలన్ని పటాపంచలవుతాయి. ఎందుకంటే, నితిన్ సంగ్వాన్ అనే అధికారి తను ఇంటర్ లో కెమిస్ట్రీలో 24 మార్కులు తెచ్చుకుని జస్ట్ పాస్ అయ్యానంటూ మార్కుల మెమోను ట్విట్టర్ లో పంచుకున్నారు.


ప్రస్తుతం నితిన్ సంగ్వాన్ అహ్మదాబాద్ లో డిప్యూటీ మున్సిపల్ కమిషనర్, అహ్మదాబాద్ స్మార్ట సిటీ సీఈఓగా పనిచేస్తున్నారు. ‘సీబీఎస్‌ఈ ఇంటర్‌ పరీక్షల్లో నాకు కెమిస్ట్రీలో 24 మార్కులే వచ్చాయి. పాస్‌ మార్కుల కంటే ఒక్క మార్కు ఎక్కువ వచ్చింది. అయితే నా జీవితంలో నేను ఏం కావాలనుకుంటున్నానో ఈ మార్కులు నిర్ణయించలేదు. అందుకే మార్కుల భారాన్ని పిల్లల మీద మోపి వారిని బాధ పెట్టకండి. బోర్డు ఫలితాల కంటే జీవితం చాలా విలువైనది. రిజల్ట్‌ అనేది ఆత్మపరిశీలనకు అవకాశంగా భావించండి.. విమర్శించడానికి కాదు’అంటూ ట్వీట్ చేశారు. ఇది ప్రస్తుతం వైరల్ గా మారింది.


న్యూఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఐఏఎస్ అధికారి చేసిన ట్వీట్ పై స్పందిస్తూ‘మీరు చాలా మంచి సందేశాన్ని ఇచ్చారు. జీవితంలో గెలుపు, ఓటమిలను పరీక్షలో వచ్చే మార్కులు నిర్ణయించలేవు’అని ట్వీట్ చేశారు.