IAS Transfer: గుంజీలు తీసిన ఐఏఎస్ అధికారి.. ఆ వెంటనే ట్రాన్స్‌ఫర్ చేసిన ప్రభుత్వం.. అసలేం జరిగింది..

దీని తర్వాతే అసలు కథ మొదలైంది. ఎస్ డీఎం రింకూ సింగ్ వైఖరిని న్యాయవాదులు తీవ్రంగా తప్పుపట్టారు. అంతేకాదు తహసీల్ కార్యాలయం సమీపంలో నిరసనకు దిగారు.

IAS Transfer: లాయర్ల ముందు గుంజీలు తీసిన ఐఏఎస్ అధికారిపై బదిలీ వేటు పడిన ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. ఐఏఎస్ ట్రాన్సఫర్ వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అసలు ఆయన గుంజీలు ఎందుకు తీశారు? ప్రభుత్వం ఆయనను ఎందుకు ట్రాన్సఫర్ చేసింది? అనే వివరాల్లోకి వెళితే..

షాజహాన్‌పూర్‌లో నిరసన తెలుపుతున్న న్యాయవాదుల ముందు చెవులు పట్టుకుని గుంజీలు తీశారు ఐఏఎస్ అధికారి రింకూ సింగ్ రాహి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అంతే.. అలా జరిగిన 36 గంటల తర్వాత ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఐఏఎస్ అధికారిని బదిలీ చేసింది. లక్నోలోని రెవెన్యూ బోర్డుకు అటాచ్ చేసింది. షాజహాన్‌పూర్‌లోని పోవాయన్ తహసీల్‌కు సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్‌డిఎం)గా నియమితులైన రాహిని ఇప్పుడు ఆ పదవి నుంచి తప్పించింది ప్రభుత్వం.

“న్యాయవాదుల ముందు రాహి చేసిన నిరసన ప్రదర్శనను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఇది అఖిల భారత సేవల ప్రవర్తన నియమాలను ఉల్లంఘించడమే కాకుండా ఒక అధికారికి తగనిది. పదవికి అనుగుణంగా లేని అనుచిత చర్య” అని రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు అన్నారు.

2022 బ్యాచ్ కు చెందిన IAS అధికారి రింకూ సింగ్ రాహి.. జూలై 28న రాత్రి 11 గంటలకు SDM గా బాధ్యతలు స్వీకరించారు. మరుసటి రోజు తహసీల్ ప్రాంగణంలో తనిఖీ చేస్తున్నప్పుడు ఒక న్యాయవాది గుమాస్తా (క్లర్క్) బహిరంగ ప్రదేశంలో గోడకు మూత్ర విసర్జన చేస్తున్నట్లు ఆయన గమనించారు. దీన్ని ఆయన సహించలేకపోయారు. తప్పు చేశావు అంటూ క్లర్క్ పై సీరియస్ అయ్యారు. అంతేకాదు అక్కడికక్కడే అతడితో గుంజీలు తీయించారు. మరోసారి బహిరంగ ప్రదేశంలో మూత్ర విసర్జన చేయనని అతడితో చెప్పించారు.

దీని తర్వాతే అసలు కథ మొదలైంది. ఎస్ డీఎం రింకూ సింగ్ వైఖరిని న్యాయవాదులు తీవ్రంగా తప్పుపట్టారు. అంతేకాదు తహసీల్ కార్యాలయం సమీపంలో నిరసనకు దిగారు. సరైన పారిశుధ్య సౌకర్యాలు లేకపోవడం వల్ల న్యాయవాదులు, క్లర్క్ లు తరచుగా బహిరంగంగా మూత్ర విసర్జన చేయాల్సి వస్తుందని వారంతా వాపోయారు. ఆవరణలోని మరుగుదొడ్ల దారుణమైన పరిస్థితి గురించి న్యాయవాదులు తమ బాధలను వ్యక్తం చేశారు. అలాంటి మరుగు దొడ్లలోకి ఎలా వెళ్లగలం అని తమ గోడు వెళ్లబోసుకున్నారు. న్యాయవాదుల ఆందోళనలు, ఆవేదనను తాను అర్థం చేసుకున్నానని రింకూ సింగ్ చెప్పారు. తహసీల్‌లో సీనియర్ అధికారిగా అపరిశుభ్రతకు నైతిక బాధ్యతను తాను స్వీకరిస్తున్నానని చెప్పారు.

అంతేకాదు ఆయన అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. న్యాయవాదుల ముందు గుంజీలు తీశారు. ఒక ఐఏఎస్ అధికారి ఇలా చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కొందరు ఈ చర్యను ప్రశంసించారు. మరికొందరు విమర్శించారు. ఒక ఐఏఎస్ అధికారి ఇలా గుంజీలు తీయడం ఏంటని ఉన్నతాధికారులు మండిపడ్డారు.

ఐఏఎస్ అధికారి గుంజీల వ్యవహారం దుమారం రేపింది. ఉన్నతాధికారులు తీవ్రంగా స్పందించారు. ఈ సంఘటనపై రాష్ట్ర ప్రభుత్వం DM నుండి వివరణాత్మక నివేదిక కోరింది. నివేదిక సమర్పించిన తర్వాత రాహిని SDM బాధ్యతల నుండి తొలగించింది. లక్నోలోని రెవెన్యూ బోర్డుకు బదిలీ చేసింది. మీ బదిలీకి వీడియోనే కారణమా అని మీడియా అడగ్గా.. అయ్యి ఉండొచ్చు అని రింకూ సింగ్ సమాధానం ఇచ్చారు.

రింకూ సింగ్ ట్రాన్సఫర్ ని షాజహాన్ పూర్ డిస్ట్రిక్ మేజిస్ట్రేట్ ధర్మేంద్ర ప్రతాప్ సింగ్ ధృవీకరించారు. బదిలీ అనేది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అన్నారు. బదిలీ వెనుకున్న కారణం ఏంటో తనకు తెలియదన్నారు.

గుంజీలు తీసిన అంశంతో పాటు బదిలీ వ్యవహారంపై రింకూ సింగ్ రాహి స్పందించారు. “పారిశుధ్యం నిర్వహణ SDM ప్రత్యక్ష బాధ్యత కాదు. కానీ, ఒక సీనియర్ అధికారిగా నేను బాధ్యత తీసుకున్నాను. సీనియర్లు ఆదర్శంగా ఉంటేనే వ్యవస్థ మెరుగుపడుతుంది. విధుల్లో చేరిన తర్వాత అది నా మొదటి రోజు మాత్రమే. ఏదైనా తప్పు జరిగినప్పుడు, ఒక అధికారి జవాబుదారీగా ఉండాలనే సందేశాన్ని సమాజానికి పంపాలనుకున్నాను. బదిలీలు వ్యవస్థలో భాగం. ప్రభుత్వం నన్ను ఎక్కడికి పంపినా పూర్తి నిబద్ధతతో సేవ చేస్తాను” అని రింకూ సింగ్ రాహి తేల్చి చెప్పారు.

రింకూ సింగ్ రాహి గతంలోనూ హైలైట్ అయ్యారు. 2008లో ముజఫర్ నగర్ లో 100 కోట్ల రూపాయల స్కామ్ ని బయటపెట్టారు. 2009లో బ్యాడ్మింటన్ ఆడుతున్న సమయంలో ఆయన ముఖంపై కాల్పులు జరిపారు దుండగులు. ఈ ఘటనలో ఆయన ఒకవైపు కంటి చూపు కోల్పోయారు. ఆయన పుర్రెలో ఇప్పటికీ బుల్లెట్ ముక్క అలాగే ఉంది.

Also Read: షార్ట్ వీడియోస్‌‌తో జాగ్రత్త..! నా పిల్లలను అస్సలు చూడనివ్వను.. తల్లిదండ్రులకు యూట్యూబ్ కో ఫౌండర్ వార్నింగ్..