నేను యావరేజ్ స్టూడెంట్ ను.. ఇప్పుడు కలెక్టర్ : స్టూడెంట్స్ ఆత్మహత్యలపై కదిలించిన పోస్టు

  • Publish Date - May 15, 2019 / 07:07 AM IST

తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చాక విద్యార్ధులు ఆత్మహత్య చేసుకోవడంపై వచ్చిన విమర్శలు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రాష్ట్రంలో 23మంది విద్యార్ధులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అలాగే సీబీఎస్‌సీ 10వ తరగతి, 12వ తరగతి ఫలితాలు వచ్చాక కూడా అదేవిధంగా దేశవ్యాప్తంగా విద్యార్ధులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ క్రమంలో వారి ఆత్మహత్యలను చూసి చలించిపోయిన ఐఏఎస్ ఆఫీసర్ ఫేస్‌బుక్ వేదికగా చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

వివరాల్లోకి వెళ్తే.. 2009బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ అవనీష్ కుమార్ శరణ్ ప్రస్తుతం ఛత్తీస్‌ఘడ్‌లోని కబీర్‌దాం జిల్లాకు కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన తన ఫేస్‌బుక్ ద్వారా పరీక్షల్లో వచ్చిన ఫలితాల కారణంగా ఆత్మహత్య చేసుకోవాలనుకునేవారిని ఉద్దేశించి ఓ సుధీర్ఘమైన స్పూర్తిని నింపే పోస్ట్ పెట్టారు.

“నేను న్యూస్ పేపర్‌లో చూశాను. తనకు అనుకున్న మార్కులు రాలేదనే బాధలో ఓ 18ఏళ్ల విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి మరణం నన్ను తీవ్రంగా కలచివేసింది. నేను విద్యార్ధులకు, వారి తల్లిదండ్రులకు ఓ విజ్ఞప్తి చేస్తున్నాను. విద్యార్ధులు వారికి వచ్చే ఫలితాలను సీరియస్‌గా తీసుకోవద్దు. మార్కులు అనేవి జస్ట్ నంబర్ మాత్రమే. మార్కులు మీ భవిష్యత్తును నిర్ణయించలేవు. విద్యార్థులు నంబర్ల ఆటలో పడిపోకండి. మిమ్మల్ని మీరు నిరూపించుకునేందుకు ఎన్నో అవకాశాలు వస్తాయి.

మార్కులే ప్రతిభకు కొలమానం కాదు. అందుకు నేనే ఒక ఉదాహరణ. నాకు 10వ తరగతిలో 44.5శాతం మార్కులు మాత్రమే వచ్చాయి. 12వ తరగతిలో 65 శాతం మార్కులు వచ్చాయి. బీ.ఏలో 60శాతం మార్కులు వచ్చాయి. అయితేనేం. ఇవాళ ఒక జిల్లాకు కలెక్టర్‌గా వ్యవహరిస్తున్నాను. దయచేసి తప్పుడు నిర్ణయాలతో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడవద్దు” అంటూ విజ్ఞప్తి చేశారు. 
 

ట్రెండింగ్ వార్తలు