దగ్గరగా.. దూరంగా.. : శివసేనకే ఎన్‌సీపీ సపోర్ట్.. అవిశ్వాసం తర్వాత ఏం జరుగుతుంది?

  • Publish Date - November 10, 2019 / 06:55 AM IST

ప్రజలు తమను ప్రతిపక్షంలోనే కూర్చోమని తీర్పు ఇచ్చారని, ప్రతిపక్షంలోనే కూర్చుంటామని చెప్పిన ఎన్‌సీపీ ఎట్టకేలకు తమ నిర్ణయాలను మార్చుకుంటుంది. అయోధ్యపై తీర్పు వచ్చిన క్రమంలో మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్, ఎన్‌సీపీలు పావులు కదుపుతున్నాయి. ఈ క్రమంలోనే శరద్ పవార్ కీలక పాత్ర పోషించేందుకు సిద్ధం అవుతున్నారు. శివసేనతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఎన్‌సీపీ ఉన్నట్లుగా అర్థం అవుతుంది. మహారాష్ట్రలో నవంబర్ 9తో అసెంబ్లీ గడువు ముగిసింది. దీంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కచ్చితంగా చేయవలసిన పరిస్థితి.

అయితే మహారాష్ట్రాలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని గవర్నర్ కూడా పిలుపునిచ్చారు. ఇదే క్రమంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. బల నిరూపణ సభలో ఎన్‌సీపీ ఆ పార్టీకి వ్యతిరేకంగా ఓటేస్తుంది. అంతే కాకుండా శివసేన కూడా బీజేపీకి ఓటేయకపోతే వారితో పొత్తుపై ఆలోచిస్తాం. శివసేన ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటాం అని ఎన్‌సీపీ నేత నవాబ్‌ మాలిక్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదే జరిగితే బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు.

ఈ క్రమంలో బీజేపీ ఒకవేళ ప్రభుత్వం ఏర్పాటు చేసినా కూడా బలం నిరూపించుకునే అవకాశం లేదు. మహారాష్ట్రలో అవిశ్వాస తీర్మాణం అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామంటూ శివసేన-ఎన్‌సీపీ-కాంగ్రెస్ కలిసి ఉమ్మడి ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి రెండు వారాలైనా కూడా అక్కడ ప్రభుత్వం ఏర్పాటు కాట్లేదు. 50-50 ఫార్ములాలో ముఖ్యమంత్రి పదవి ఇస్తేనే ప్రభుత్వ ఏర్పాటుకు సహకరిస్తామని శివసేన కచ్చితంగా చెప్పేసింది.