సువెందు శపథం : మమతని 50వేల ఓట్ల తేడాతో ఓడించకపోతే పాలిటిక్స్ వదిలేస్తా

Adhikari accepts Mamata’s Nandigram challenge సవాళ్లు, ప్రతిసవాళ్లతో బెంగాల్ రాజకీయాలు వేడెక్కాయి. మరో మూడు నెలల్లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తానంటూ సోమవారం సీఎం మమతాబెనర్జీ చేసిన ప్రకటనపై నందిగ్రామ్ ప్రాంతంలో పట్టున్న బీజేపీ రాజకీయ దిగ్గజం సువెంద్ అధికారి ధీటుగా స్పందించారు. ఎన్నికలప్పుడే మమతకి నందిగ్రామ్ గుర్తుకొచ్చిందని విమర్శించారు. నందిగ్రామ్ కి మమత ఏం చేసిందని ప్రశ్నించారు.
తన నియోజకవర్గమైన నందిగ్రామ్‌లో మమతను ఓడిస్తానని సువెందు అధికారి అన్నారు. సీఎం మమతను 50,000 ఓట్ల మెజార్టీతో ఓడించి తీరుతానని శపథం చేశారు. లేదంటే రాజకీయాల నుంచే వైదొలుగుతానని సువెందు సంచలన ప్రకటన చేశారు. కోల్‌కతాలో జరిగిన ఓ ర్యాలీలో సుబేందు పై వ్యాఖ్యలు చేశారు. తృణమూల్ రాజకీయ పార్టీ కాదని, అదో ప్రైవేట్ కంపెనీ అని సుబేందు ఎద్దేవా చేశారు. టీఎంసీ ఎన్నికల్లో గెలుపు కోసం పక్క రాష్ట్రం నుంచి ప్రశాంత్ కిశోర్‌ను అద్దుకు తెచ్చుకున్నారని, దీన్ని బట్టే బీజేపీ గెలిచిపోతోందని అర్థమైపోతోందని ఆయన పేర్కొన్నారు.
కాగా,ప్రస్తుతం భవానీపుర్ అసెంబ్లీ నియోజకవర్గానికి సీఎం మమతా బెనర్జీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్ కీలక నేత సువేందు అధికారి.. ఇటీవల పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన నేపథ్యంలో ఆయన స్థానమైన నందిగ్రామ్ నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. భవానీపుర్ నుంచి కూడా పోటీ చేయనున్నట్లు వెల్లడించారు.
మరోవైపు, కోల్‌కతాలో భాజపా నిర్వహించిన రోడ్‌షోలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు కొందరు భాజపా కార్యకర్తలపై రాళ్లు రువ్వారు. సువేందుతో పాటు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ఈ ర్యాలీకి హాజరయ్యారు. నగరంలోని టోలీగంజ్ నుంచి రాష్‌బెహారీ అవెన్యూ వరకు భాజపా కార్యకర్తలు ర్యాలీగా వెళ్లారు. చారు మార్కెట్ సమీపానికి వెళ్లగానే పలువురు రాళ్లు విసిరారు.