ATM Glitch : రూ. 10 వేలు డ్రా చేయడానికి వెళ్తే.. రూ.3,28,000 వచ్చాయి.. ఏం జరిగిందంటే..
ATM Glitch : సురత్ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి రూ. 10 వేలు డ్రా చేయడానికి వెళ్తే.. రూ.3 లక్షలకు పైగా వచ్చాయి. అది కూడా 9 సంవత్సరాల తర్వాత.. అసలేం జరిగిందంటే..
in surat an ATM glitch made a man rich after 9 years From Rs 10000 to Rs 3 28 Lakh
ATM Glitch : సురత్ నగరానికి చెందిన ఓ వ్యక్తి ఏటీఎంలో రూ.10 వేలు డ్రా చేయడానికి వెళ్తే.. ఆ డబ్బు కాస్త తొమ్మిదేళ్ల ఆలస్యం తర్వాత రూ.3 లక్షలకు పైగా పెరిగి అతడి చేతికి అందింది. ఇంతకు ఏం జరిగిందంటే.. ఏటీఎం లోపం కారణంగా డబ్బులు చేతికి రాకుండానే అకౌంట్ నుంచి కట్ అయ్యాయి. ఆ డబ్బులను తిరిగి పొందడం కోసం అతడు చేసిన ప్రయత్నం ఫలించి.. 9 సంవత్సరాల తర్వాత 30 రెట్లు పైగా మొత్తం పొందాడు.
ఈ సంఘటన 2017 ఫిబ్రవరి 18న జరిగింది. సూరత్, ఉద్నా ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం నుంచి రూ.10 వేలు డ్రా చేయడానికి వెళ్లాడు. ఏటీఎంలోకి వెళ్లి.. తన కార్డు పెట్టి.. పిన్ నంబర్ ఎంటర్ చేశాడు. ఆ తర్వాత 10 వేల రూపాయలు డ్రా చేయడానికి ప్రయత్నించాడు. అయితే అతడికి ఏటీఎం నుంచి డబ్బులు రాలేదు.. రసీదు కూడా రాలేదు. కానీ, అతని ఖాతా నుంచి డబ్బు కట్ అయినట్లు మెసేజ్ వచ్చింది.
వెంటనే అతడు డుంబాల్ ప్రాంతంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్‌ను సంప్రదించాడు. మార్చి నుంచి మే వరకు పలుమార్లు ఇమెయిల్స్ ద్వారా ఫాలోఅప్ చేసినా సమస్య పరిష్కారం కాలేదు. తర్వాత, అతను SBI వద్ద RTI ద్వారా ఏటీఎం CCTV ఫుటేజ్ కోరాడు. కానీ ఆ ప్రయత్నం కూడా వృథా అయ్యింది. చివరకు డిసెంబర్లో వినియోగదారుల ఫోరమ్‌ను ఆశ్రయించాడు.
విచారణ సమయంలో, బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ లావాదేవీ SBI ఏటీఎంలో జరిగిందని, తమ రికార్డుల ప్రకారం ఇది “సక్సెస్” అయిందని వాదించింది. అయితే, కమిషన్ ఈ వాదనను తిరస్కరించింది. వినియోగదారుడి చేతికి నగదు ఇచ్చినట్లు నిరూపించడం బ్యాంక్ బాధ్యత అని స్పష్టం చేసింది. అంతేకాక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నియమం ప్రకారం.. ఇలాంటి వివాదాస్పద లావాదేవీల్లో 5 రోజుల్లోగా డబ్బును తిరిగి వినియోగదారుడికి ఇవ్వాలి. లేదంటే రోజుకింత అని ఫైన్ కట్టాల్సి వస్తుంది.
ఈ కేసులో 9 సంవత్సరాల తర్వాత వచ్చిన తీర్పులో సదరు వినియోగదారుడికి:
- అతడి అసలు రూ.10,000 మొత్తాన్ని 9 శాతం వార్షిక వడ్డీతో తిరిగి చెల్లించాలని ఆదేశించారు.
- ఆలస్యానికి రోజుకు రూ.100 చొప్పున జరిమానా విధించారు.
- మొత్తం ఆలస్యం 3,288 రోజులు కావడంతో, జరిమానా మొత్తం రూ.3,28,000కి చేరింది.
దీనితో పాటు అదనంగా:
- మానసిక ఇబ్బందులకు రూ.3,000
- న్యాయ ఖర్చులకు రూ.2,000 చెల్లించాలని బ్యాంక్‌ను ఆదేశించారు.
