India – China Agreement: బ్రిక్స్ సదస్సు వేళ కీలక పరిణామం.. భారత్ – చైనా దేశాల మధ్య కీలక ఒప్పందం..!

2020 జూన్ 15న తూర్పు లద్దాక్ లోని గల్వాన్ లోయలో భారత్ - చైనా సైనికుల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. 20మంది భారత సైనికులు వీరమరణం పొందారు.

India and China

India China Conflict : భారత్ – చైనా దేశాల మధ్య చాలాకాలంగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. రెండు దేశాల మధ్య సరిహద్దు విషయంలో విబేధాలు నెలకొన్నాయి. దీంతో ఇరు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. తాజాగా ఇరు దేశాల సంబంధాలను మెరుగుపర్చేలా కీలక పరిణామం చోటు చేసుకుంది. వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి గత నాలుగేళ్లుగా కొనసాగుతున్న ఉద్రిక్తలకు ముగింపు పలుకుతూ ఇరు దేశాలు కీలక గస్తీ ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం.. 2020 నాటి యథాస్థితి ఎల్ఏసీ వెంబడి ఇక కొనసాగనుంది. భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మాట్లాడుతూ.. ఇక నుంచి ఇరు దేశాల సైనికులు 2020లో గస్తీ నిర్వహించిన పెట్రోలింగ్ పాయింట్లకు స్వేచ్ఛగా వెళ్లొచ్చునని చెప్పారు. అయితే, చైనాలో బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు ప్రారంభం వేళ ఇరు దేశాల మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గించేలా ఒప్పందం జరగడం కీలక పరిణామం అనే చెప్పొచ్చు. మంగళవారం నుంచి ప్రారంభమయ్యే బ్రిక్స్ సమావేశంలో.. భారత్ ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ హాజరుకానున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో బ్రిక్స్ సదస్సులో ఇరుదేశాల అధ్యక్షులు భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయని దౌత్య వర్గాలు పేర్కొంటున్నాయి.

Also Read: డ్రాగన్ కంట్రీ చైనా యుద్ధానికి సిద్ధమవుతోందా? ఏ క్షణమైనా వార్ జరగనుందా?

2020 జూన్ 15న తూర్పు లద్దాక్ లోని గల్వాన్ లోయలో భారత్ – చైనా సైనికుల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. 20మంది భారత సైనికులు వీరమరణం పొందారు. చైనాసైతం భారీగానే సైనికులను కోల్పోయింది. అయితే, ఆ సంఖ్యను వెల్లడించలేదు. తరువాత కాలంలో ఐదుగురు మాత్రమే చనిపోయారని చెప్పింది. గల్వాన్ లోయలో ఘర్షణతో ఇరు దేశాలు ఎల్ఏసీ వెంబడి భారీ సంఖ్యలో సైనికులను మోహరించాయి. నాటినుంచి ఇరు దేశాల సరిహద్దుల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

Also Read: విమానాలు, రైళ్లకు ఫేక్ బెదిరింపు కాల్స్.. అసలేం జరుగుతోంది? భారత్ టార్గెట్‌గా భారీ కుట్ర పన్నారా?

గాల్వాన్ వ్యాలీలో జరిగిన సంఘటన తరువాత కొన్ని పెట్రోలింగ్ పాయింట్ల వద్ద పెట్రోలింగ్ నిలిపివేయడం జరిగింది. అయితే, తాజా తీర్మానం ఉద్రిక్తతను తగ్గించడంలో సహాయపడుతుంది. ఉదాహరణకు, చైనా కూడా కొన్ని ప్రాంతాల్లో సైనిక స్థావరాలను నిర్మించింది. ఇది ఉద్రిక్తతను మరింత పెంచింది. ఇరుదేశాల మధ్య తాజాగా తీర్మానం తరువాత దీనికి పరిష్కారం కొనుగొనవచ్చు. ముఖ్యంగా దేప్‌సాంగ్, డెమ్‌చోక్ ప్రాంతాలకు సంబంధించి వివాదం జరిగింది. దీనిపై చర్చలలో సమస్య ఉంది. వీటన్నింటిపై పరిష్కారం లభించే అవకాశాలు ఉన్నాయి. అయితే, ఇరు దేశాల సైన్యం మధ్య తాజా ఒప్పందంపై ఓ జాతీయ ఛానెల్ లో భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ మాట్లాడారు. సరిహద్దుల్లో గస్తీపై చైనాతో ఒప్పందానికి వచ్చాం. 2020కి ముందు పరిస్థితికి వెళ్లాం. బలగాల ఉపసంహరణ ప్రక్రియ కూడా ముగిసిందని చెప్పొచ్చునని అన్నారు. తాజా పరిణామాలతో త్వరలోనే భారత్, చైనా దేశాల మధ్య మళ్లీ పూర్వపు వాతావరణం నెలకొనే అవకాశలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.