తీహార్ జైలు రెడీగా ఉంది : భారత్ కు దావూద్!

  • Published By: venkaiahnaidu ,Published On : March 16, 2019 / 02:16 PM IST
తీహార్ జైలు రెడీగా ఉంది : భారత్ కు దావూద్!

Updated On : March 16, 2019 / 2:16 PM IST

ఓవైపు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూనే మరోవైపు తమంతటి శాంతివంతమైన దేశం లేదని ప్రపంచానికి కలరింగ్ ఇస్తున్నపాక్ కు భారత అధికారులు శనివారం(మార్చి-16,2019) గట్టి షాక్ ఇచ్చారు. ఉగ్రవాదంపై పోరాడుతున్నట్లు గాలి కబుర్లు చెప్పడం కాదని, నిజంగా ఉగ్రవాదులపై చర్యలు తీసుకుంటున్నట్లు నమ్మాలంటే మొదట భారత్ లో అనేక ఉగ్రదాడులకు పాల్పడి పాక్ లో రాజభోగాలు అనుభవిస్తున్నదావూద్ ఇబ్రహీం, సయీద్ సలావుద్దీన్, మరో ఇద్దరు ఉగ్రవాదులను భారత్ కు అప్పగించాలని భారత అధికారులు పాక్ కి తెలియజేశారు. పుల్వామా ఉగ్రదాడి తర్వాత దానికి కారణమైన జైషే మహమ్మద్,ఇతర ఉగ్రవాదసంస్థలపై సరైన చర్యలు తీసుకోవడంలో పాక్ ప్రభుత్వం విఫలమైందన్నారు.

పాక్ నుంచి ఉగ్రసంస్థలను నడిపిస్తున్న కో ఆర్డినేటర్లు,తదితరులకు సంబంధించిన ముఖ్యసమాచారం పాక్ కు భారత్ అందించినప్పటికీ పాక్ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. పుల్వామా ఉగ్రదాడి తర్వాత ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాక్ ను అంతర్జాతీయ సమాజంలో ఒంటరిని చేసేందుకు భారత్ దౌత్యప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంది.

ఎట్టిపరిస్థితుల్లోనూ ఉగ్రవాదులను,వారికి మద్దతిచ్చే దేశాలను వదిలిపెట్టేది లేదని భారత ప్రభుత్వం కూడా సృష్టం చేసింది.దావూద్‌ను అమెరికా, ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్రవేసిన విషయం తెలిసిందే.ప్రస్తుతం దావూద్ కరాచీలో ఉంటున్నాడన్న విషయం పాక్ కు తప్ప ప్రపంచమంతా తెలిసిందే.హిజ్బుల్ ముజాహిద్దీన్‌ నేత సలావుద్దీన్ పీవోకే, రావల్పిండి కేంద్రంగా నేరాలకు పాల్పడుతున్నాడు.