పుల్వామా ఉగ్రదాడి : ఇమ్రాన్ ఖాన్ ఇవిగో ఆధారాలు

పుల్వామా ఉగ్ర దాడి ఘటనపై ఆధారాలు సమర్పిస్తే తగిన చర్యలు తీసుకుంటామని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన ప్రకటనపై భారత్ స్పందించింది. ఇవిగో ఆధారాలు..ఇక ఏ చర్యలు తీసుకుంటారో చెప్పండి అంటూ భారత్ ప్రశ్నిస్తోంది. ప్రపంచ దేశాల ముందు భారత్ ప్రతిష్ట దెబ్బతీయాలని అనుకుంటున్న పాక్ పాచికలు పారడం లేదు. వాస్తవాలు ఇవిగో అంటూ భారత్ ప్రకటించడంతో ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో పాక్ నిలబడింది.
పుల్వామా ఉగ్రదాడి తాము చేశామని జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై పాక్ అభ్యంతరం వ్యక్తం చేసింది. తగిన ఆధారాలు ఇవ్వాలంటూ ఫిబ్రవరి 27వ తేదీ బుధవారం పాక్ పీఎం ఇమ్రాన్ ప్రకటించారు. ఫిబ్రవరి 28వ తేదీ గురువారం తగిన ఆధారాలను భారత్ సమర్పించింది. దేశంలోని పాకిస్థాన్ తాత్కాలిక హైకమిషనర్ సయ్యద్ హైదర్ షాకు ఈ ఆధారాలు సమర్పించింది. పాకిస్థాన్‌లోని జైషే మహ్మద్ ఉగ్రవాద స్థావరాలు సాయం చేశాయనేందుకు స్పష్టమైన ఆధారాల్ని పాకిస్థాన్‌కు ఇచ్చింది భారత్. ఈ ఆధారాలతో పాక్ తగిన చర్యలు తీసుకొంటుందని..సరిహద్దులో ఉన్న ఉగ్రవాద శిబిరాలను తొలగిస్తుందని భావిస్తున్నట్లు భారత విదేశాంగ పేర్కొంది.
ఫిబ్రవరి 14వ తేదీన పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మంది CRPF సైనికులు వీరమరణం పొందారు. అనంతరం భారత్ జరిపిన ప్రతికార చర్య దాడిలో జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఉగ్రవాదులు హతమయ్యారు.