Corona Vaccination: దేశంలో 80శాతం మంది వయోజనులకు రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తి

ఇతర అభివృద్ధి చెందిన దేశాల్లోనూ సాధ్యంకాని ఘనత కేవలం భారత్ లోనే సాధ్యమైందని, దేశ ప్రజల సహకారం, ప్రధాని మోదీ యొక్క కృషితోనే ఇది సాధ్యమైందని మాండవీయ అన్నారు

Vaccine

Corona Vaccination: దేశంలో 80 శాతం మంది వయోజనులకు(Adults) కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. దేశంలో ఇప్పటివరకు మొత్తం 175 కోట్లకు పైగా కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేయగా..వాటిలో 96.5 శాతం టీకాలు అర్హులైన వారు తొలి డోసు తీసుకున్నారు. ఇక అర్హులైన వయోజనులు 80 శాతం మంది రెండు డోసుల కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారని కేంద్ర మంత్రి తెలిపారు. జనవరి 2021 నుంచి దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ కొనసాగుతుండగా.. దశల వారీగా జరిపిన ప్రయోగాల అనంతరం ఒక్కో వయసుల వారికీ టీకా అర్హతను నిర్దారించారు. ఈక్రమంలో ఈ ఏడాది జనవరి నుంచి 15-18 ఏళ్ల వారికి కోవిడ్ టీకా అందిస్తున్నారు. ఇప్పటి వరకు మొత్తం 2 కోట్ల మంది యువతకు రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ అందించినట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి.

Also read: Telangana Corona Cases : తెలంగాణలో కొత్తగా 401 కరోనా కేసులు

కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రధాని మోదీ నేతృత్వంలో భారత్ 100 శాతం వ్యాక్సిన్ పంపిణీ దిశగా దూసుకుపోతోందని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ ట్వీట్ చేశారు. ప్రధాని మోడీ నేతృత్వంలో టీకా పంపిణీని పూర్తిగా డిజిటల్ విధానాన్ని అవలంబించడంతో ఈ వృద్ధి సాధ్యమైనట్లు ఆయన తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను విజయవంతంగా నడిపించడంలో CoWIN యాప్ కీలక పాత్ర పోషించిందని మాండవీయ పేర్కొన్నారు. ఇతర అభివృద్ధి చెందిన దేశాల్లోనూ సాధ్యంకాని ఘనత కేవలం భారత్ లోనే సాధ్యమైందని, దేశ ప్రజల సహకారం, ప్రధాని మోదీ యొక్క కృషితోనే ఇది సాధ్యమైందని మాండవీయ అన్నారు.