Operation Sindoor: భారత్‌తో పెట్టుకుంటే అంతేమరి.. ఏటీజీఎం దెబ్బకు పాక్ బంకర్లు బద్దలవుతున్నాయ్.. ఏమిటీ మిసైల్.. ఎలా పనిచేస్తుందంటే?

నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వెంబడి ఉన్న అనేక పాకిస్తాన్ సైనిక పోస్టులపై దాడి చేయడానికి భారతదేశం యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణులను ఉపయోగించింది.

anti-tank guided missile

Operation Sindoor: భారతదేశంపై దాడి చేయడం అంటే ప్రమాదాన్ని కొనితెచ్చుకోవటమే అనే విషయం పాకిస్థాన్ ఆర్మీకి క్రమంగా బోధపడుతోంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోన్న పాకిస్థాన్.. మనపై రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోంది. డ్రోన్లు, క్షిపణులతో దాడులకు ప్రయత్నిస్తోంది. వీటిని భారత బలగాలు సమర్ధంగా తిప్పికొడుతున్నాయి. గురువారం రాత్రి పాకిస్థాన్ ఆర్మీ భారత్ సరిహద్దు ప్రాంతాల్లో దాడులకు పాల్పడింది. పాక్ దాడులను భారత సైన్యం సమర్ధంగా తిప్పికొట్టింది.

 

భారత సైన్యం దాడుల నుంచి తప్పించుకునేందుకు పాక్ లోని చాలా ప్రాంతాల్లో ప్రత్యేక బంకర్లు నిర్మించుకున్నారు. ఏదైనా ప్రమాదం పొంచిఉన్నట్లు భావిస్తే వెంటనే బంకర్లలోకి వెళ్లిపోతుంటారు. అయితే, ప్రస్తుతం వారికి భారత సైన్యం గట్టి షాకిస్తుంది. బంకర్లనుసైతం ధ్వంసం చేసేందుకు ఏటీజీఎం (యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్) అనే ప్రత్యేకమైన ఆయుధాన్ని వాడుతోంది. భారీ సాయుధ కవచాలతో డిజైన్ చేసిన వాహనాలను ధ్వంసం చేయడానికి దీనిని వాడుతారు. ఒక్కసారి దీనిలో ట్యాంక్ లేదా టార్గెట్ ను లాక్ చేస్తే అది నేరుగా లక్ష్యాన్ని వెంటాడి ఛేదిస్తుంది. నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వెంబడి ఉన్న అనేక పాకిస్తాన్ సైనిక పోస్టులపై దాడి చేయడానికి భారతదేశం యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణులను ఉపయోగించింది.

 

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ (ATGM) అనేది ఒక రకమైన గైడెడ్ క్షిపణి, ఇది ముఖ్యంగా ట్యాంకులు, ఇతర సాయుధ సైనిక వాహనాలను ధ్వంసం చేయడానికి రూపొందించబడింది. దీన్ని ఆయుధాలు, గైడెడ్ వెపన్, యాంటీ ఆర్మర్ గైడెడ్ వెపన్ అని కూడా పిలుస్తారు. దీన్ని ఎక్కడికైనా మోసుకెళ్లేలా ఈ మిసైల్ ను తీర్చిదిద్దారు. డైరెక్ట్ అటాక్ మోడల్ లో లక్ష్యాన్ని రీచ్ అవుతుంది. పగలు, రాత్రి అన్నిరకాల పరిస్థితుల్లో పనిచేసేలా యాంటీట్యాంక్ గైడెడ్ మిసైల్ ను తయారు చేశారు. చాలా వరకు ఏటీజీఎంల్లో షేపుడ్ ఛార్జి అనే దానిని వినియోగిస్తారు. ఈ పేలుడు పదార్థాల్లోని శక్తి మొత్తం ఒకే దిశలో కేంద్రీకృతమై ప్రయాణిస్తుంది. తద్వారా మందపాటి సాయుధ కవచాన్ని కూడా ఛేదించేంత శక్తి విడుదల చేస్తుంది.

 

ఏటీజీఎంలలో రెండు దఫాలుగా పేలుళ్లు జరిగేలా ప్రత్యకమైన వార్ హెడ్లను వినియోగిస్తారు. తొలి పేలుడుకు ట్యాంక్ కు బయట సాయుధ కవచం ధ్వంసం అవుతుంది. రెండో పేలుడులో ట్యాంక్‌ ను ధ్వంసం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 130కిపైగా దేశాలు ఏటీజీఎంలను వినియోగిస్తున్నాయి. ప్రస్తుతం ఆపరేషన్ సిందూర్ లో భాగంగా భారత్ కూడా వీటిని వినియోగిస్తుంది. ఇటీవల జరిగిన రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సమయంలోనూ వీటిని విస్తృతంగా ప్రయోగించారు.