World Inequality Report: సంపన్నుల సంపద మాత్రమే పెరుగుతున్న పేద దేశం భారత్!

భారతదేశంలో ఆర్ధిక అసమానతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి.

World Inequality Report: సంపన్నుల సంపద మాత్రమే పెరుగుతున్న పేద దేశం భారత్!

Poor

Updated On : December 10, 2021 / 10:15 AM IST

World Inequality Report: భారతదేశంలో ఆర్ధిక అసమానతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వనరులను ఉపయోగించి సంపద పెంచుకుంటున్నాం అని సంబరపడుతున్నాం కానీ ఆ సంపదంతా ఎటుపోతోంది అనేది మాత్రం అర్థం కావట్లేదు. స్వాతంత్ర్యం వచ్చాక ధనవంతులు మరింత ధనవంతులు అయ్యారు.. పేదవాళ్ళు మరింత పేదవాళ్లుగా మారుతున్నారు. ఇప్పటికీ ఇదే పరిస్థితి కనిపిస్తుంది అని లేటెస్ట్ లెక్కలు చెబుతున్నాయి.

ధనవంతుల సంపద భారీగా పెరుగుతున్న పేద దేశం భారత్ అని ప్రపంచ ఇండెక్స్ చెబుతోంది. అవునూ.. World Inequality Report-2022 ప్రకారం.. 2021 జాతీయ ఆదాయంలో ఐదో వంతు కేవలం ఒక శాతం మంది దగ్గరే ఉన్నట్లు నివేదిక చెబుతోంది. 2021లో మొత్తం జాతీయ ఆదాయంలో ఒక్క శాతం ధనవంతులైన భారతీయుల వద్ద 22 శాతం సంపద కలిగి ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. సంపన్నుల లిస్ట్‌లోని మొదటి 10 శాతం మంది చేతిలోనే 57 శాతం ఆదాయం ఉన్నట్లు వరల్డ్‌ ఇనీక్వాలిటీ ల్యాబ్‌ రిపోర్ట్ స్పష్టం చేసింది.

సంపదలో అసమానతలు:
భారతదేశంలో వయోజనుల సగటు ఆదాయం ఏడాదికి 2లక్షల 4వేల 200రూపాయలు అని రిపోర్ట్‌లో తేలింది. సంపద విషయంలో కిందనున్న 50 శాతం కుటుంబాల వద్ద అసలేమీ సంపద లేదు. మధ్య తరగతి వారి వద్ద 29.5 శాతం సంపద ఉండగా.. 10 శాతం మంది దగ్గరే 65 శాతం, 1 శాతం మంది దగ్గర 33 శాతం సంపద ఉన్నట్లు రిపోర్ట్‌ల్లో స్పష్టం అయ్యింది.

మధ్యతరగతి వారి వద్ద సగటున ఒకరి దగ్గర 7లక్షల 23వేల 930రూపాయల సంపద ఉండగా.. అదే పైన ఉన్న 10 శాతం మంది దగ్గర సగటున 63లక్షల 54వేల 70రూపాయల సంపద.. ఒక శాతం మంది దగ్గర మాత్రం 3కోట్ల 24లక్షల 49వేల 360 సంపద ఉన్నట్లు తెలిపింది.

గడిచిన మూడేళ్లలో పేదవారి పరిస్థితి మరింత దిగజారిపోయిందని, వారి జీవనవిధానంలో మరింత అసమానతలు చోటుచేసుకున్నాయని ఇండెక్స్ చెబుతోంది. అయితే, దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌ వంటి దేశాల కంటే భారతదేశంలో ఆదాయ అసమానత తక్కువగా ఉన్నట్లు నివేదిక చెబుతోంది.