Shubhanshu Shukla: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో 18 రోజుల ప్రయాణం తర్వాత భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా తన భార్య కామ్నా శుక్లా, ఆరేళ్ల కుమారుడు కియాష్ శుక్లాను కలిశారు. కామ్నా, కియాష్ టెక్సాస్‌లోని హూస్టన్‌లో శుభాంశు పక్కనే ఉన్నారు. గత రెండు నెలల్లో శుక్లా తన కుటుంబాన్ని చూడటం ఇదే మొదటిసారి. “ఇది సవాల్ తో కూడుకున్నది. భూమికి తిరిగి వచ్చి నా కుటుంబాన్ని నా చేతులతో పట్టుకోవడం ఆనందంగా ఉంది” అని శుభాంశు అన్నారు.
“శుభాన్షు సురక్షితంగా తిరిగి వచ్చాడు కాబట్టి, మా తక్షణ దృష్టి అతని పునరావాసం, భూమిపై లైఫ్ సజావుగా సర్దుబాటు చేసుకునేలా చూసుకోవడంపై ఉంటుంది” అని కామ్నా చెప్పారు. “మాకు, ఈ అద్భుతమైన ప్రయాణం తర్వాత తిరిగి కలవడం అనేది ఒక వేడుక లాంటిది” అని ఆమె అన్నారు. “అంతరిక్షంలో ఉన్న సమయంలో ఇంట్లో వండిన భోజనాన్ని ఆయన ఎంతగా మిస్ అయ్యారో తెలుసు. అందుకే, నేను ఇప్పటికే ఆయనకి ఇష్టమైన వంటకాలను తయారు చేస్తున్నా” అని ఆమె చెప్పారు.
”అంతరిక్షయానం అద్భుతంగా ఉంటుంది. కానీ చాలా కాలం తర్వాత మీ ప్రియమైన వారిని చూడటం కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. నేను క్వారంటైన్‌లోకి వెళ్లి 2 నెలలు అయింది. క్వారంటైన్ కుటుంబ సందర్శనల సమయంలో మేము 8 మీటర్ల దూరంలో ఉండాల్సి వచ్చింది. నా చిన్నారి చేతుల్లో క్రిములు ఉన్నాయని చెప్పాల్సి వచ్చింది. అందుకే అతను నన్ను తాకలేకపోయాడు. అతను సందర్శనకు వచ్చిన ప్రతిసారీ తన అమ్మను “నేను నా చేతులు కడుక్కోవచ్చా?” అని అడిగేవాడు. అది సవాల్ తో కూడుకున్నది. భూమికి తిరిగి వచ్చి నా కుటుంబాన్ని నా చేతుల్లో పట్టుకోవడం అద్భుతంలా అనిపించింది” అని తన అనుభవాన్ని పంచుకున్నారు శుభాంశు శుక్లా.
Also Read: హిందీ నేర్చుకోవడంలో తప్పు లేదు, కానీ ఇంగ్లీష్ అంతకన్నా ముఖ్యం- జగన్ కీలక వ్యాఖ్యలు
ISS నుండి డాకింగ్ అయిన వెంటనే కాల్ రావడం “అద్భుతమైన” “ఊహించని” ఆశ్చర్యం కలిగించిందని కామ్నా చెప్పారు. “ఆయన సురక్షితంగా ఉన్నారని తెలుసుకోవడం, ఆయన గొంతు వినడం నాకు ప్రాణం లేచి వచ్చినట్లైంది. మా సంభాషణలు సాధారణంగా ఆయన రోజువారీ కార్యకలాపాలు, ఆయన నిర్వహించిన ప్రత్యేకమైన ప్రయోగాలు, ఎదుర్కొన్న అసాధారణ అనుభవాల చుట్టూ తిరుగుతాయి. ఇవి భూమిపై జీవితానికి చాలా భిన్నంగా ఉన్నాయి. ఈ ఫోన్ కాల్స్ 18 రోజుల పాటు నా రోజులో హైలైట్‌గా మారాయి” అని ఆమె వెల్లడించారు.
శుభాంశు, కామ్నాలు 3వ తరగతి నుండి ఒకరికొకరు తెలుసు. వారిద్దరూ లక్నోలోని సిటీ మాంటిస్సోరి స్కూల్‌లో చదివారు. 2009లో వీరు వివాహం చేసుకున్నారు. ఈ అంతరిక్ష యాత్ర.. 2027లో ఇస్రో చేపట్టబోయే మొట్టమొదటి సిబ్బందితో కూడిన అంతరిక్ష ప్రయాణం గగన్ యాన్ మిషన్‌తో శుక్లా ఇప్పటికే అనుసంధానించబడ్డాడు.
శుక్లా మరో ముగ్గురు వ్యోమగాములతో కలిసి అంతరిక్ష యాత్ర చేశారు. ఆక్సియం -4 మిషన్‌ను పూర్తి చేశారు. మంగళవారం భూమిపైకి సేఫ్ గా రీచ్ అయ్యారు. స్పేస్‌ఎక్స్ డ్రాగన్ అంతరిక్ష నౌకలో 22 గంటల ప్రయాణం తర్వాత వారు భూమికి సురక్షితంగా తిరిగి వచ్చారు. 1984లో సోవియట్ రష్యన్ మిషన్‌లో భాగంగా రాకేష్ శర్మ అంతరిక్షంలోకి వెళ్లారు. ఆ తర్వాత అంతరిక్షంలోకి ప్రయాణించిన రెండవ భారతీయుడు శుక్లానే. 18 రోజుల పాటు ISSలో ప్రయాణించిన మొదటి భారతీయుడు కూడా ఆయనే. ఇది అత్యంత సుదీర్ఘమైన ప్రయాణం.