Ys Jagan: హిందీ నేర్చుకోవడంలో తప్పు లేదు, కానీ ఇంగ్లీష్ అంతకన్నా ముఖ్యం- జగన్ కీలక వ్యాఖ్యలు
దేశవ్యాప్తంగా తీసుకురావాల్సిన అతి పెద్ద మార్పు ఇదే. మన దేశం మరింత ముందుకు వెళ్లాలన్నా, లీడ్ చేయాలన్నా ఇంగ్లీష్ తప్పనిసరి.

YS Jagan
Ys Jagan: హిందీ భాష.. ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన అంశం. అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య దీనిపై వివాదం తార స్థాయికి చేరింది. హిందీ భాషను బలవంతంగా తమపై రుద్దాలని చూస్తే ఊరుకునేది లేదని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఓపెన్ గానే కేంద్రంపై మండిపడుతున్నారు.
దేశవ్యాప్తంగా చర్చనీయాశంగా మారిన హిందీ భాష వివాదంపై మాజీ సీఎం, వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ స్పందించారు. హిందీ భాష గురించి మాట్లాడుతూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. హిందీ భాష నేర్చుకోవడం తప్పు కాదన్నారు జగన్. హిందీ బోధించాలా వద్దా అనే విషయం కన్నా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధనపై ప్రభుత్వాలు దృష్టి సారించాలని జగన్ సూచించారు.
ఇంగ్లీష్ మీడియంలో బోధన ద్వారానే యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని స్పష్టం చేశారు. ఉన్న భాషల్లో హిందీ ఒకటి అని చెప్పిన జగన్ ఇంగ్లీష్ గ్లోబల్ లాంగ్వేజ్ అని వ్యాఖ్యానించారు. ఇంగ్లీష్ మీడియంలో పిల్లలకు పాఠాలు బోధిస్తూ మాతృభాషను తప్పనిసరి చేయాలన్నారు. తప్పనిసరిగా ఇంగ్లీష్ మీడియంలో బోధన చేస్తూ.. లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2, లాంగ్వేజ్ 3 కింద ఆయా రాష్ట్రాల మాతృభాషతో పాటు హిందీ నేర్చుకునే అవకాశం కల్పించాలని జగన్ అభిప్రాయపడ్డారు.
”తీసుకురావాల్సిన మార్పు హిందీ కాదు. హిందీ కూడా ఒక భాషగా ఉండొచ్చు. హిందీ నేర్చుకోవచ్చు. కానీ మీడియం ఆఫ్ ఎడ్యుకేషన్ గా ఇంగ్లీష్ ఉండాలి. దేశవ్యాప్తంగా తీసుకురావాల్సిన అతి పెద్ద మార్పు ఇదే. మన దేశం మరింత ముందుకు వెళ్లాలన్నా, లీడ్ చేయాలన్నా ఇంగ్లీష్ తప్పనిసరి. ఇంగ్లీష్ గ్లోబల్ లాంగ్వేజ్. ఈ ప్రభుత్వాలు చేయాల్సిన పని అదే. ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియంలో బోధించాలి.
పిల్లలు ఇంగ్లీష్ లో అనర్గళంగా మాట్లాడగలగాలి. మీడియం ఆఫ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఉండాలి. ఆ తర్వాత పిల్లల ఇష్టానికి వదిలేయాలి. వాళ్లు ఏ భాష కావాలంటే అది నేర్చుకునే అవకాశం ఇవ్వాలి. మాతృభాషను కచ్చితమైన సబ్జెక్ట్ గా పెట్టాలి. అది లాంగ్వేజ్ 1గా పెట్టాలి. లాంగ్వేజ్ 2గా హిందీని సెలెక్ట్ చేసుకోవచ్చు. అందులో తప్పు లేదు. నా ఫస్ట్ లాంగ్వేజ్ హిందీ. నేను చదివింది ఇంగ్లీష్ మీడియం స్కూల్ లోనే. నేను చదివిన స్కూల్ లో సెకండ్ లాంగ్వేజ్ తెలుగు” అని జగన్ అన్నారు.